Bank Strike: బ్యాంక్ ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తున్నారు.? ఇంత‌కీ వారి డిమాండ్లు ఏంటి.?

Bank Strike: 8 లక్షల మంది బ్యాంకింగ్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.

Mokshith
Published on: 27 Sept 2026 7:13 PM IST
Bank Strike
X

Bank Strike: బ్యాంక్ ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తున్నారు.? ఇంత‌కీ వారి డిమాండ్లు ఏంటి.? 

Bank Strike: 8 లక్షల మంది బ్యాంకింగ్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు సమ్మె కొనసాగనుంది. ఇంత‌కీ స‌మ్మె ఎందుకు చేప‌డుతున్నారో తెలుసా.?

వారానికి ఐదు రోజుల పని కోసం డిమాండ్

బ్యాంకు ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాయి. ప్రస్తుతం ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. మిగిలిన శనివారాల్లో సాధారణంగా సేవలు కొనసాగుతాయి. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించి, సోమవారం నుంచి శుక్రవారం వరకు పని వేళలను కొంత పెంచాలని యూనియన్లు ప్రతిపాదిస్తున్నాయి.

శనివారాల్లో సెలవు కల్పిస్తే వారంలో మిగిలిన రోజుల్లో రోజుకు అదనంగా 40 నిమిషాలు పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని సంఘాలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇన్సూరెన్స్ రంగం, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఐటీ రంగంలో ఐదు రోజుల పని విధానం అమల్లో ఉందని యూనియన్లు గుర్తుచేస్తున్నాయి. సిబ్బంది కొరత, పెరుగుతున్న పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వంటి అంశాలను కూడా వారు ప్రస్తావిస్తున్నారు.

పెన్షన్ నుంచి పీఎల్ఐ వరకు మరిన్ని డిమాండ్లు

ఐదు రోజుల పనిదినాలే కాకుండా ఉద్యోగ సంఘాలు మరికొన్ని అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగుల పెన్షన్‌ను తాజా వేతన సవరణలకు అనుగుణంగా అప్‌డేట్ చేయాలని కోరుతున్నాయి. కొత్త పెన్షన్ విధానం (NPS) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. అదే విధంగా పనితీరు ఆధారంగా అందించే ప‌ర్ఫామెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) విధానంలో మార్పులు చేయాలని యూనియన్లు కోరుతున్నాయి. ఉద్యోగుల పని పరిస్థితులు, సిబ్బంది లభ్యత, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేస్తున్నాయి.

సెప్టెంబర్ 30న సమ్మెతో అదనపు ఇబ్బందులు?

సమ్మె ప్రభావంపై ప్రభుత్వం, బ్యాంకింగ్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 30 అర్ధవార్షిక ఖాతాల ముగింపు తేదీ కావడంతో ఆ రోజు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతే వ్యాపార లావాదేవీలు, పన్ను చెల్లింపులు, ఖాతాల సర్దుబాట్లపై ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఐదు రోజుల పని విధానం అమల్లోకి వస్తే బ్యాంకింగ్ సేవలపై, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారాలపై ప్రభావం పడొచ్చన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. 2024 మార్చిలో జరిగిన వేతన ఒప్పందంలో ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అంశాన్ని సూత్రప్రాయంగా పరిశీలించినప్పటికీ, దీనికి తుది ప్రభుత్వ ఆమోదం ఇంకా రాలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌కు ఇబ్బంది ఉండదా?

సమ్మె కారణంగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పూర్తిగా నిలిచిపోవాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ సేవలు సాధారణంగానే అందుబాటులో ఉంటాయి. అయితే బ్యాంకు శాఖల్లో జరిగే నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, భారీ మొత్తాల నగదు డిపాజిట్లు, ఇతర ప్రత్యక్ష సేవలకు అంతరాయం ఏర్పడొచ్చు. మరోవైపు సెప్టెంబర్ 30లోపు తమ డిమాండ్లపై పరిష్కారం లభించకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని బ్యాంకు ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వం, బ్యాంకింగ్ యూనియన్ల మధ్య జరిగే చర్చలు కీలకంగా మారనున్నాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.