ATM నుంచి నెలకు ఎన్నిసార్లు ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు? ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే!

ATM Withdrawal Rules: బ్యాంకు ఖాతాదారులు తరచూ ATMల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేస్తుంటారు. అయితే ATMలో ఉచిత లావాదేవీలకు పరిమితి ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు.

Mokshith
Published on: 28 Nov 2026 3:23 PM IST
ATM Withdrawal Rules
X

ATM నుంచి నెలకు ఎన్నిసార్లు ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు? ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే!

ATM Withdrawal Rules: బ్యాంకు ఖాతాదారులు తరచూ ATMల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేస్తుంటారు. అయితే ATMలో ఉచిత లావాదేవీలకు పరిమితి ఉంటుందనే విషయం చాలామందికి తెలియదు. ఆ పరిమితి దాటితే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఈ నేపథ్యంలో ATM లావాదేవీలకు సంబంధించి RBI కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

ఫ్రీ లిమిట్ పూర్తయితే బ్యాంకు నుంచి అలర్ట్

కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారులు తమ నెలవారీ ఉచిత ATM లావాదేవీల్లో ఎన్ని ఉపయోగించుకున్నారు? ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? అనే వివరాలు తెలుసుకునేలా బ్యాంకులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ATM ద్వారా లావాదేవీ చేసినప్పుడు SMS లేదా ఇతర మార్గాల్లో ఈ వివరాలను తెలియజేసే అవకాశం ఉంటుంది. దీంతో ఫ్రీ ట్రాన్సాక్షన్ల పరిమితి ఎప్పుడు పూర్తవుతుందో ఖాతాదారులకు ముందుగానే తెలుస్తుంది.

అలాగే ATM ఉన్న ప్రాంతం మెట్రో లేదా నాన్ మెట్రో అనే వివరాలను కూడా ATM వద్ద స్పష్టంగా ప్రదర్శించాలి. ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ, సహకార బ్యాంకులకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

నెలకు ఎన్ని ఉచిత ATM లావాదేవీలు చేసుకోవచ్చు?

RBI నిబంధనల ప్రకారం ATMల ద్వారా ప్రతి నెలా నిర్దిష్ట సంఖ్యలో ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇందులో నగదు విత్‌డ్రా చేయడంతో పాటు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వంటి లావాదేవీలు కూడా ఉంటాయి. మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత లావాదేవీలు. నాన్ మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు. సొంత బ్యాంకు ATMలు ఉచిత లావాదేవీలకు సంబంధించిన వర్తించే పరిమితులు ఉంటాయి.

ఇతర బ్యాంకుల ATMలను ఉపయోగించినా ఈ లావాదేవీల పరిమితులను పరిగణనలోకి తీసుకోవాలి. అయితే బ్యాంకులు తమ ఖాతాదారులకు నిబంధనల కంటే ఎక్కువ ఉచిత లావాదేవీలను అందించే అవకాశం కూడా ఉంది.

ఫ్రీ లిమిట్ దాటితే ఎంత ఛార్జీ చెల్లించాలి?

నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత అదనంగా చేసే ప్రతి ATM లావాదేవీపై బ్యాంకులు గరిష్ఠంగా రూ.23 ఛార్జీ వసూలు చేయవచ్చు. దీనికి వర్తించే పన్నులు అదనం.

అయితే బ్యాంకును బట్టి ఛార్జీల్లో మార్పులు ఉండవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ATMలో నగదు లేకపోవడం, సర్వర్ పనిచేయకపోవడం, నెట్‌వర్క్ సమస్యలు వంటి సాంకేతిక కారణాలతో లావాదేవీ విఫలమైతే దానికి ఎలాంటి ఛార్జీ వసూలు చేయకూడదు. బ్యాంకు వైపు నుంచి తలెత్తిన సాంకేతిక సమస్యలకు ఖాతాదారులు అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

PoS, UPI ద్వారా కూడా నగదు తీసుకోవచ్చు

ATMలతో పాటు PoS (పాయింట్ ఆఫ్ సేల్) మిషన్ల ద్వారా కూడా నగదు తీసుకునే సదుపాయం ఉంది. ఇందుకోసం తప్పనిసరిగా ఏదైనా వస్తువు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డు, పూర్తి KYC ఉన్న ప్రీపెయిడ్ కార్డులు లేదా UPI ద్వారా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

RBI మార్గదర్శకాల ప్రకారం PoS మిషన్ ద్వారా ఒక్కో లావాదేవీలో గరిష్ఠంగా రూ.2,000 వరకు నగదు తీసుకోవచ్చు. నెలవారీ పరిమితి రూ.10,000గా ఉంటుంది. ఈ సేవకు ఛార్జీలు విధించినట్లయితే అవి లావాదేవీ మొత్తంలో 1 శాతానికి మించకూడదు. ఒకవేళ వస్తువులు కొనుగోలు చేస్తూనే నగదు తీసుకుంటే, వస్తువుల ధర, తీసుకున్న నగదు వివరాలను బిల్లులో వేర్వేరుగా చూపించాలి.

గమనిక: ATM ఫ్రీ ట్రాన్సాక్షన్ల పరిమితి, ఛార్జీలు బ్యాంకును బట్టి మారవచ్చు. కాబట్టి మీ బ్యాంకు నిబంధనలను కూడా ఒకసారి పరిశీలించడం మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.