8th Pay Commission: 8వ వేతన సంఘంపై పెరుగుతోన్న ఆశలు.. జీతాల పెంపు ఎప్పుడంటే!
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘంపై ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కమిషన్ ఏర్పాటై ఏడాది పూర్తయింది.
8th Pay Commission: 8వ వేతన సంఘంపై పెరుగుతోన్న ఆశలు.. జీతాల పెంపు ఎప్పుడంటే!
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘంపై ఆశలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కమిషన్ ఏర్పాటై ఏడాది పూర్తయింది. మొత్తం 18 నెలల గడువులో దాదాపు 66 శాతం సమయం ముగిసింది. దీంతో కొత్త వేతన సవరణలు ఎలా ఉండబోతున్నాయి? జీతాలు ఎంత పెరగవచ్చు? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? అనే అంశాలపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.
8వ వేతన సంఘానికి నాయకత్వం వహిస్తున్నదెవరు?
8వ కేంద్ర వేతన సంఘానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ పులక్ ఘోష్ సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్‌కు తన నివేదిక సమర్పించేందుకు 18 నెలల గడువు ఇచ్చింది. ఈ సమయంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, భత్యాలు, ఇతర సౌకర్యాలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో ఎలాంటి మార్పులు?
8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కొత్త పే మ్యాట్రిక్స్ కీలక అంశాలుగా ఉండనున్నాయి. వీటి ఆధారంగానే ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత నిర్ణయిస్తారనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత లేదు.
వీటితో పాటు కరువు భత్యం (DA), పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం (DR), ఇంటి అద్దె భత్యం (HRA) వంటి అంశాలను కూడా కమిషన్ పరిశీలించనుంది. ఉద్యోగుల పదోన్నతులు, వార్షిక ఇంక్రిమెంట్లు, ఇతర సౌకర్యాలపైనా సూచనలు చేయనుంది. ప్రస్తుత జీవన వ్యయం, ఉద్యోగుల అవసరాలు, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కొత్త వేతన విధానాన్ని రూపొందించనుంది.
ఇప్పటివరకు ఎంత పని పూర్తయింది?
8వ వేతన సంఘం అధికారిక సమావేశాలు 2026 మార్చిలో ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, పెన్షనర్ల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించే ప్రక్రియ జులైలో పూర్తయింది. ప్రస్తుతం ఆయా వర్గాల నుంచి అందిన సూచనలు, గణాంకాలను పరిశీలించే దశలో కమిషన్ ఉంది.
వీటి ఆధారంగా వేతనాలు, భత్యాలు, పెన్షన్లకు సంబంధించిన సిఫార్సులను సిద్ధం చేయనుంది. కమిషన్‌కు ఇచ్చిన 18 నెలల గడువులో ఇప్పటికే దాదాపు 66 శాతం సమయం పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన సమయంలో నివేదిక తయారీపై దృష్టి సారించనుంది.
ఎప్పటిలోగా సిఫార్సులు అమల్లోకి వస్తాయి?
కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి 18 నెలల్లోగా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 2027 మే నాటికి సిఫార్సులు అందించే అవకాశం ఉంది. అయితే నివేదిక సమర్పించిన వెంటనే ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని భావించకూడదు.
ముందుగా కమిషన్ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలి. ఆ తర్వాత వాటిని ఆమోదించి, ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి కొత్త వేతన విధానం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఉద్యోగుల చేతికి అందే పెరిగిన జీతాలపై మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లలో ప్రధాన ఆసక్తి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఖరారు చేస్తారనే అంశంపైనే ఉంది.




