Youdha ePod: ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 227 కిమీ ప్రయాణం.. సరికొత్త ఫీచర్లతో దూసుకొస్తున్న త్రీ-వీలర్
జుపేరియా ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ యోధా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘనతను సాధించింది.
Youdha ePod
Youdha ePod: భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త మైలురాయి నమోదైంది. జుపేరియా ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ యోధా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘనతను సాధించింది. కంపెనీ తన 1000వ ఈ-పాడ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను విజయవంతంగా మార్కెట్లోకి విడుదల చేసింది. దేశంలో లాస్ట్-మైల్ కమర్షియల్ మొబిలిటీ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఈ సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది.
యోధా ఈ-పాడ్ ఎలక్ట్రిక్ త్రి-వీలర్ అత్యుత్తమ ఫీచర్లతో రూపొందించబడింది. ఇందులో 11.8 కిలోవాట్ల ఎల్ఎఫ్పీ బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ సహాయంతో వాహనం పూర్తి ఛార్జింగ్‌పై ఏకంగా 227 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీని టాప్ స్పీడు గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది. ఈ బ్యాటరీ 6 కిలోవాట్ల పవర్‌తో పాటు 53 ఎన్ఎం టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా కేవలం 4 నుంచి 5 గంటల్లోనే ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
డ్రైవర్‌తో కలుపుకుని ఈ వాహనంలో నలుగురు ప్రయాణికులు సౌకర్యంగా కూర్చునే అవకాశం ఉంది. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు దీనిలో 7 అంగుళాల స్మార్ట్ సీఏఎన్ డిజిటల్ ఎల్ఈడీ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 120/80-ఆర్12 సైజు టైర్లు ఉండగా, దీని వీల్‌బేస్ 2100 మిమీగా ఉంది. ప్రయాణికుల భద్రతతో పాటు రోడ్డుపై స్థిరంగా నడిచేలా దీనిని పటిష్టంగా డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా యోధా సంస్థ సీఈఓ ఆయుష్ లోహియా మాట్లాడుతూ.. వెయ్యి యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విజయం తమకు భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లేలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందన్నారు. రాబోయే రోజుల్లో కార్గో, ప్యాసెంజర్ అవసరాలకు తగినట్లుగా తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.




