Upcoming Cars: హోండా నుంచి ఎలక్ట్రిక్ SUV.. మహీంద్రా నుంచి కొత్త మోడల్.. 2027లో రాబోతున్న 5 కార్లు ఇవే
భారత కార్ల మార్కెట్లో 2027లో కొత్త SUVల సందడి పెరగనుంది. హోండా ALPHA ఎలక్ట్రిక్ SUV, మహీంద్రా Vision S, మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్, విన్‌ఫాస్ట్ VF5 అప్డేటెడ్ మోడల్, హ్యుందాయ్ బయాన్ CNG వేరియంట్లు రానున్నాయి.
Upcoming SUVs
Upcoming Cars: భారత కార్ల మార్కెట్లో SUVలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ప్రముఖ కార్ల కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా కాంపాక్ట్, మిడ్‌సైజ్ SUV విభాగాల్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హోండా, మహీంద్రా, మారుతి సుజుకి, విన్‌ఫాస్ట్, హ్యుందాయ్ సంస్థలు కొత్త మోడళ్లు లేదా అప్డేటెడ్ వేరియంట్లపై దృష్టి పెట్టాయి. వీటిలో ఎలక్ట్రిక్ SUVలు, పెట్రోల్ మోడళ్లు, CNG వాహనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్న ఐదు SUVల వివరాలు తెలుసుకుందాం.
1. హోండా ఆల్ఫా ఈవీ
హోండా ఆల్ఫా హోండా నుంచి రాబోతున్న తొలి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ SUV. ఈ కారుకు ఆల్ఫా అనే పేరును కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2026 డిసెంబర్ 2న భారత్‌లోనే దీన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనుంది. రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో ఈ SUV తయారయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బ్యాటరీ సామర్థ్యం, డ్రైవింగ్ రేంజ్ వంటి పూర్తి వివరాలను హోండా వెల్లడించలేదు. నివేదికల ప్రకారం ఇందులో 65kWh నుంచి 75kWh వరకు సామర్థ్యం ఉన్న LFP బ్యాటరీ ప్యాక్‌లు ఉండొచ్చని అంచనా. ఒకసారి ఛార్జ్ చేస్తే 450 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ రావచ్చనే ప్రచారం కూడా ఉంది. ఇవి అధికారికంగా ప్రకటించిన గణాంకాలు కావు. 2027లో దీని అమ్మకాలు, డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
2. మహీంద్రా విజన్ ఎస్
మహీంద్రా విజన్ ఎస్ మహీంద్రా నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన SUV. 2025 ఆగస్టులో Vision S కాన్సెప్ట్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన టెస్ట్ వాహనాలు రోడ్లపై కనిపిస్తున్నాయి. మహీంద్రా కొత్త NU_IQ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే తొలి SUV ఇదే కావచ్చని అంచనా. కంపెనీ 2027 మొదటి అర్ధభాగంలో కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. Vision S ఆధారంగా తయారయ్యే ప్రొడక్షన్ మోడల్ కూడా 2027 జూన్‌లోపు వచ్చే అవకాశం ఉంది. బాక్సీ డిజైన్, పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉండొచ్చని టెస్ట్ వాహనాల ఆధారంగా అంచనా వేస్తున్నారు. అయితే ఇంజిన్, ఫీచర్లు, ధరపై కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. NU_IQ ప్లాట్‌ఫామ్ పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లకు అనుకూలంగా ఉంటుంది.
3. మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్
మారుతి ఫ్రాంక్స్ ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న మోడల్. ఇప్పుడు దీన్ని మరిన్ని ఫీచర్లతో అప్డేట్ చేసేందుకు మారుతి సుజుకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. టెస్ట్ సమయంలో కనిపించిన ఫ్రాంక్స్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, మారిన బంపర్, వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నట్లు ఆటోమొబైల్ నివేదికలు వెల్లడించాయి. లోపల వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, లెవల్ 2 ADAS వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్ విషయంలోనూ మార్పులు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ స్థానంలో కొత్త 1.2 లీటర్ Z12E మూడు సిలిండర్ల ఇంజిన్‌ను ఇవ్వొచ్చని సమాచారం. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రం కొనసాగవచ్చు. CNG వేరియంట్లోనూ మార్పులు ఉండొచ్చని అంచనా. అయితే మారుతి ఇంకా ఫేస్‌లిఫ్ట్ విడుదల తేదీని ప్రకటించలేదు. 2027లో ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
4. విన్‌ఫాస్ట్ VF5 ఫేస్‌లిఫ్ట్
వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్ సంస్థ భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తన ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా VF5 ఎలక్ట్రిక్ SUV అప్డేటెడ్ మోడల్‌ను భారత్‌కు తీసుకురావచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ వియత్నాంలో ఇప్పటికే పరిచయం చేసింది. కొత్త ఫ్రంట్ డిజైన్, మారిన హెడ్‌ల్యాంప్స్, అప్డేటెడ్ బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్ ఇందులో కనిపిస్తున్నాయి. క్యాబిన్లో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, మారిన డ్యాష్‌బోర్డ్ వంటి మార్పులు ఉన్నాయి. గ్లోబల్ మోడల్లో 43kWh బ్యాటరీతో పాటు ఒకసారి ఛార్జ్ చేస్తే 370 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల రేంజ్‌ను కంపెనీ పేర్కొంది. అయితే ఇది NEDC పరీక్షా విధానంలో ప్రకటించిన రేంజ్. వాస్తవ వినియోగంలో రేంజ్ మారవచ్చు. ఈ SUV భారతదేశంలో ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై కంపెనీ ఇంకా అధికారిక తేదీ ప్రకటించలేదు.
5. హ్యుందాయ్ బేయాన్ CNG
హ్యుందాయ్ బేయాన్ CNG వేరియంట్‌ను తీసుకొచ్చేందుకు హ్యుందాయ్ సిద్ధమవుతోంది. ఈ మోడల్‌ను 2027 జనవరిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించినట్లు ఆటోమొబైల్ నివేదికలు వెల్లడించాయి. ఇందులో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా CNG సెటప్ ఇవ్వొచ్చని అంచనా. CNG ట్యాంక్‌ను వాహనం కింది భాగంలో అమర్చే అవకాశం ఉంది. అలా చేస్తే బూట్ స్పేస్‌పై ప్రభావం తగ్గుతుంది. ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఈ వేరియంట్ వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. CNG వేరియంట్లో ఇంజిన్ పవర్, మైలేజ్, ధర వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ మోడల్ అందుబాటులోకి వస్తే పెట్రోల్ SUV కొనాలా, CNG SUV కొనాలా అని ఆలోచించే వినియోగదారులకు మరో ఎంపిక లభిస్తుంది.




