Upcoming Cars: బాబోయ్ ఒకటా రెండా.. అక్టోబర్‌లో ఏకంగా 11 కార్లు వచ్చేస్తున్నాయ్
Upcoming Cars: అక్టోబర్ 2026 కార్ల ప్రియులకు పండగ వాతావరణం తీసుకురానుంది. భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఏకంగా 11 కొత్త కార్లు అడుగుపెడుతున్నాయి.
Volkswagen Virtus facelift
Upcoming Cars: కొత్త కారు కొనాలని కలలు కంటున్న వాహన ప్రియులకు అక్టోబర్ నెల సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. భారత ఆటోమొబైల్ రంగానికి ఈ నెల ఎంతో ప్రత్యేకంగా మారబోతోంది. ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 కొత్త మోడళ్లు రోడ్లపైకి రాబోతున్నాయి. ఈ జాబితాలో రాయల్ లుక్ ఇచ్చే లగ్జరీ సెడాన్లు, రఫ్ అండ్ టఫ్ SUVలు, పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), ఇంధన పొదుపు అందించే హైబ్రిడ్ మోడళ్లు, పాపులర్ కార్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు అలరించడానికి సిద్ధమయ్యాయి. ప్రతి బడ్జెట్ విభాగానికి అనుగుణంగా కార్ల తయారీ సంస్థలు తమ కొత్త వాహనాలను ప్రవేశపెడుతున్నాయి.
మెర్సిడెస్-మేబ్యాక్ S-క్లాస్ ఫేస్‌లిఫ్ట్
అతిపెద్ద లగ్జరీ ఆకర్షణగా మెర్సిడెస్-మేబ్యాక్ S-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అక్టోబర్ 5న అధికారికంగా లాంచ్ కాబోతోంది. ఈ సూపర్ లగ్జరీ కారు బయటి డిజైన్‌లో సరికొత్త క్రోమ్ గ్రిల్, కొత్తగా రూపుదిద్దిన హెడ్‌లాంప్స్, బ్రాండ్ ప్రత్యేకతను చాటే స్టార్ ఆకారపు DRL లైట్లను అమర్చారు. క్యాబిన్ లోపల 14.4 అంగుళాల భారీ సెంట్రల్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, అల్ట్రా-ప్రీమియం సీటింగ్ సదుపాయాలు ప్రయాణికులకు రాజసంతో కూడిన అనుభూతిని ఇస్తాయి. గ్లోబల్ మార్కెట్‌లో లభించే S580 వెర్షన్‌లో 4.0 లీటర్ V8 ఇంజిన్ ప్రసిద్ధి చెందింది. ఇది 537 హెచ్‌పి వరకు విపరీతమైన పవర్ అవుట్‌పుట్ అందిస్తుంది.
హోండా ఎలివేట్, స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లు
అక్టోబర్ 6వ తేదీన రెండు అద్భుతమైన ఫేస్‌లిఫ్ట్ కార్లు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో మొదటిది పాపులర్ కాంపాక్ట్ SUV హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్. కొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్, ఆధునిక LED లైటింగ్, సెక్యూరిటీ కోసం 360-డిగ్రీ కెమెరా, పెంచిన సైజుతో సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పవర్ ట్రైన్ విషయానికి వస్తే నమ్మకమైన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇందులో కొనసాగే అవకాశం ఉంది.
అదే రోజున ప్రీమియం సెడాన్ స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ కూడా గ్రాండ్‌గా ప్రవేశపెడుతున్నారు. ఈ సరికొత్త స్లావియాలో డ్రైవింగ్ అనుభవాన్ని మరింత పెంచడానికి కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. లోపల 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక సీట్లకు మసాజ్ ఫీచర్ వంటి అధునాతన హంగులు చేర్చారు.
వోల్వో EX90, ES90 మోడళ్లు
విద్యుత్ వాహనాల విభాగంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి వోల్వో సంస్థ అక్టోబర్ 12న రెండు ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకోస్తోంది. మొదటిది వోల్వో EX90 – ఇది మూడు వరుసల సీటింగ్ సదుపాయం ఉన్న భారీ లగ్జరీ ఎలక్ట్రిక్ SUV. ఇందులో పవర్ ఫుల్ 106 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 625 కిలోమీటర్ల వరకు లాంగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
దీనితో పాటు వోల్వో ES90 పేరుతో సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్‌ను కూడా లాంచ్ చేస్తున్నారు. కొనుగోలుదారుల కోసం 92kWh, 106kWh బ్యాటరీ ఆప్షన్లను అందిస్తున్నారు. టాప్ వేరియంట్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 696 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణిస్తుందని సమాచారం.
హ్యుందాయ్ బేయాన్, ఆడి Q3, డస్టర్ హైబ్రిడ్
అక్టోబర్ నెలలో గ్లోబల్ రేంజ్ కార్ల తాకిడి ఎక్కువగా ఉండనుంది. హ్యుందాయ్ బేయాన్ కాంపాక్ట్ SUV ని గ్లోబల్ మోడల్‌గా ఈ నెలలోనే పరిచయం చేస్తున్నారు. భారతీయ రోడ్లు, కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా సిద్ధం చేస్తున్న ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు అక్టోబర్ 16న సరికొత్త తరం ఆడి Q3 లగ్జరీ SUV మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. మునుపటి మోడల్ కంటే పొడవు పెరగడంతో పాటు సరికొత్త షార్ప్ డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తోంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆడి సిగ్నేచర్ ‘క్వాట్రో’ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) టెక్నాలజీ లభిస్తాయి.
అదేవిధంగా అక్టోబర్ 17న అత్యంత ఆసక్తికరమైన రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వర్షన్ రానుంది. ఇందులో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి పనిచేసే అత్యాధునిక హైబ్రిడ్ సాంకేతికతను అందించబోతున్నారు. ఈ సిస్టమ్ దాదాపు 160 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తూ అద్భుతమైన మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది.
గ్లాంజా, విన్‌ఫాస్ట్ VF3, వర్టస్ ఫేస్‌లిఫ్ట్
మిడ్-రేంజ్, బడ్జెట్ కేటగిరీలోనూ ఆకర్షణీయమైన కార్లు సిద్ధమవుతున్నాయి. టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ కూడా అక్టోబర్‌లోనే ల్యాండ్ కానుంది. కొత్త డిజైన్ ఎలిమెంట్స్, అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో వస్తున్న ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. మైలేజ్ కోరుకునే వారి కోసం ఇందులో సీఎన్జీ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ తమ విన్ ఫాస్ట్ VF3 అనే చిన్న ఎలక్ట్రిక్ SUV తో ఇండియాలో క్రేజ్ సంపాదించడానికి వస్తోంది. కాంపాక్ట్ సైజ్, తక్కువ ధర కారణాలుగా సరసమైన ధరల ఈవీ సెగ్మెంట్‌లో ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
చివరిగా, స్పోర్టీ డ్రైవింగ్‌ను ఇష్టపడే వారి కోసం ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ సిద్ధమవుతోంది. ఎక్స్‌టీరియర్ డిజైన్ మార్పులు, ప్రీమియం డ్యాష్‌బోర్డ్, 360-డిగ్రీ కెమెరా, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను జోడించనున్నారు. ఇంజిన్ విభాగంలో ఇప్పటికే హిట్ అయిన 1.0 లీటర్ TSI, 1.5 లీటర్ TSI పెట్రోల్ ఆప్షన్లను యథాతథంగా కొనసాగించనున్నారు.




