Upcoming Cars: భారత ఆటో మార్కెట్లోకి రెండు కొత్త కంపెనీలు.. మార్కెట్లోకి ఏకంగా 5 కార్లు
Upcoming Cars: భారత కార్ల మార్కెట్లోకి డెంజా అలాగే జెఎస్‌డబ్ల్యూ మోటార్స్ కంపెనీలు అడుగుపెడుతున్నాయి.
iCar V23 EV
Upcoming Cars: భారతీయ కార్ల మార్కెట్లోకి రానున్న కొద్ది నెలల్లో రెండు సరికొత్త అంతర్జాతీయ, జాతీయ కంపెనీలు అడుగుపెట్టబోతున్నాయి. ఇందులో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYDకి చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ డెంజా ఒకటి కాగా, మరొకటి ప్రముఖ వ్యాపార దిగ్గజం జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన జెఎస్‌డబ్ల్యూ మోటార్స్. ఈ రెండు సంస్థలు భారత్‌లో అనేక కొత్త ఎస్‌యూవీలు, అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్లు అలాగే హైబ్రిడ్ మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. డెంజా లగ్జరీ కార్లపై దృష్టి పెట్టనుండగా, జెఎస్‌డబ్ల్యూ మోటార్స్ పవర్ ఫుల్ హైబ్రిడ్ అలాగే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.
BYD డెంజా నుంచి రానున్న లగ్జరీ మోడల్స్
డెంజా బ్రాండ్ నుంచి తొలి వాహనంగా D9 లగ్జరీ ఎంపీవీ నవంబర్ మధ్యలో భారత మార్కెట్లోకి రానుంది. ఈ కారులో ఏడుగురు కూర్చునే సౌకర్యంతో పాటు రెండో వరుసలో మసాజ్, హీటింగ్ అలాగే వెంటిలేషన్ సదుపాయం గల క్యాప్టెన్ సీట్లు లభించనున్నాయి. అంతేకాకుండా 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కారు టయోటా వెల్ఫైర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీనితో పాటు డెంజా Z9 GT పేరుతో మరో హై-ఎండ్ ఎలక్ట్రిక్ కార్లను కూడా కంపెనీ తీసుకురానుంది. ఇందులో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండగా, ఇవి భారీ పవర్‌ను ఉత్పత్తి చేయగలవు.
జెఎస్‌డబ్ల్యూ మోటార్స్ నుంచి జెఎస్‌డబ్ల్యూ కాంబాట్ PHEV
జెఎస్‌డబ్ల్యూ మోటార్స్ తన తొలి ఎస్‌యూవీ అయిన కాంబాట్ PHEV మోడల్‌ను డిసెంబర్ 4న ఆవిష్కరించనుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ కార్లను అసెంబ్లింగ్ చేయనున్నారు. బాక్సీ డిజైన్, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఆకట్టుకునే ఈ కారులో 1.5 లీటర్ టर्బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది దాదాపు 360bhp పవర్ ఇస్తుందని, కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌పైనే 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. మొత్తం మీద ఈ కారు సుమారు 1100 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందించనుంది.
జెఎస్‌డబ్ల్యూ J5 అలాగే iCar V23 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు
ఈ రెండు మోడళ్లతో పాటు జెఎస్‌డబ్ల్యూ మోటార్స్ సంస్థ J5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ఐదు సీట్ల మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ కారు కాగా, హ్యుందాయ్ క్రెటా ఈవీకి గట్టి పోటీ ఇస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఇది 58.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో సుమారు 402 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే దీనికి సంబంధించిన హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. వీటితో పాటు విభిన్నమైన బాక్సీ డిజైన్, గుండ్రని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన iCar V23 EV ఎస్‌యూవీని కూడా 2027 నాటికి లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.




