TVS: పల్సర్, కేటీఎం, అపాచీలను వెనక్కి నెట్టిన టీవీఎస్ బైక్
TVS: భారత మార్కెట్లో 205సీసీ నుంచి 340సీసీ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో టీవీఎస్ రోనిన్ సంచలనం సృష్టించింది.
TVS Ronin
TVS: భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో 205సీసీ నుంచి 340సీసీ మోటార్ సైకిల్ సెగ్మెంట్ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ విభాగంలో బజాజ్, టీవీఎస్, సుజుకి, కేటీఎం వంటి ప్రముఖ కంపెనీల మోడల్స్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీపడుతున్నాయి. అయితే ఆగస్టు నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, ఈ సెగ్మెంట్లో ఒకే ఒక మోడల్ అందరికంటే దూసుకుపోయింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ కి చెందిన రోనిన్ బైక్ ఈ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మిగతా అన్ని మోడళ్లను భారీ తేడాతో వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.
భారీ పట్టు సాధించిన టీవీఎస్ రోనిన్
టీవీఎస్ రోనిన్ 225 మోడల్ ఆగస్టు నెలలో ఏకంగా 11,679 మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే దీని అమ్మకాల్లో విపరీతమైన వృద్ధి కనిపించింది. గతంలో 6,623 యూనిట్లు అమ్ముడుకాగా, ఈసారి ఏకంగా 5,056 యూనిట్లు అదనంగా అమ్ముడై సుమారు 76.34 శాతం వృద్ధిని నమోదు చేసింది. కేవలం రోనిన్ మాత్రమే కాకుండా ఈ సెగ్మెంట్లో బజాజ్ పల్సర్ 220/250 మోడల్ 7,179 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక కేటీఎం 250 మోడల్ 4,471 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానాన్ని దక్కించుకోగా, బజాజ్ అవెంజర్ 220 బైక్ 2,127 యూనిట్లు అమ్ముడుపోయి మంచి వృద్ధిని కనబరిచింది.
మిగతా బ్రాండ్ల సేల్స్ పరిస్థితి ఇలా ఉంది
టీవీఎస్ అపాచీ 310 లేదా ఆర్టీఎక్స్ మోడల్ 1,925 యూనిట్లు విక్రయించగా, సుజుకి వీ-స్ట్రామ్ 250 బైక్ 1,012 యూనిట్ల అమ్మకాలు సాధించింది. వీటితో పాటు బజాజ్ డొమినార్ 250, హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్, కవసాకి 300, సుజుకి జిక్సర్ 250, కవాసాకి కేఎల్ఎక్స్ 230, హీరో కరిజ్మా 210, యమహా ఆర్3 వంటి పలు మోడల్స్ కూడా ఈ సెగ్మెంట్లో తమ లభ్యతను చాటుకున్నాయి. అయితే వీటన్నింటిలోనూ టీవీఎస్ రోనిన్ సాధించిన అమ్మకాల జోరు చూస్తుంటే యువత ఈ బైక్ను ఎంతగా ఆదరిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.
మొత్తం సెగ్మెంట్లో గణనీయమైన వృద్ధి
ఆగస్టు నెలలో ఈ మొత్తం 205సీసీ నుంచి 340సీసీ సెగ్మెంట్లో అన్ని కంపెనీల మోడళ్లు కలిపి మొత్తం 29,582 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సెగ్మెంట్ అమ్మకాల్లో అద్భుతమైన ప్రగతి కనిపించింది. రైడర్ల అభిరుచికి తగినట్లుగా టీవీఎస్ అందిస్తున్న ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, సరసమైన ధర రోనిన్ విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఈ బైక్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.




