Toyota: పెద్ద ఫ్యామిలీలకు టయోట నుంచి ఊహించని సర్‌ప్రైజ్.. మార్కెట్లోకి 6 కొత్త 7-సీటర్ కార్లు

Toyota: ప్రముఖ గ్లోబల్ ఆటోమొబైల్ తయారీ సంస్థ టయోటా భారతీయ విపణిలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవడానికి భారీ ప్రణాళికతో ముందడుగు వేస్తోంది.

CR Reddy
Published on: 18 Oct 2026 11:59 AM IST
Toyota Innova Hycross
X

Toyota Innova Hycross 

Toyota: ప్రముఖ గ్లోబల్ ఆటోమొబైల్ తయారీ సంస్థ టయోటా భారతీయ విపణిలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవడానికి భారీ ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఏకంగా ఆరు సరికొత్త 7-సీటర్ వాహనాలను భారత రోడ్లపైకి తేనుంది. ఇందులో ప్రస్తుతం ప్రజాదరణ పొందిన మోడళ్ల ఫేస్‌లిఫ్ట్ వర్షన్లతో పాటు పూర్తిస్థాయి నూతన ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ ఎంపీవీ మోడళ్లు చేరి ఉన్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీకి పెట్టింది పేరైన ఈ జపనీస్ సంస్థ, భవిష్యత్తులో భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించేలా ఈ విస్తరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

1. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్

భారతీయ కుటుంబాలకు అత్యంత ఇష్టమైన ఇన్నోవా హైక్రాస్ మోడల్ ఫేస్‌లిఫ్ట్ అవతారంలో 2026 చివరి నాటికి విడుదల కానుంది. ఈ నవీకరించబడిన వర్షన్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్‌తో పాటు ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. కేబిన్ లోపల 12.3 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ డిజిటల్ డిస్‌ప్లే, వెనుక వరుస సీట్లకు వెంటిలేషన్ సౌకర్యం కల్పించనున్నారు. ప్రసిద్ధ 2.0-లీటర్ పెట్రోల్ అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఇందులో కూడా కొనసాగనున్నాయి.

2. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 7-సీటర్

ప్రస్తుతం 5-సీటర్ విభాగంలో బాగా అమ్ముడవుతున్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను 7-సీటర్ వెర్షన్‌గా మార్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. మూడో వరుస ప్రయాణికులకు తగినంత స్థలాన్ని కేటాయించడానికి ఈ కారు పొడవును పెంచనున్నారు. బయటి డిజైన్ మూలాల్లో స్వల్ప మార్పులు చేస్తూ, క్రోమ్ ఫినిషింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్నారు. ఈ కొత్త మోడల్‌లో 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ తో పాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఇది 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశముంది.

3. నెక్స్ట్-జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్

ప్రీమియం ఎస్‌యూవీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త నెక్స్ట్-జనరేషన్ ఫార్చ్యూనర్ 2027 నాటికి భారత మార్కెట్లోకి రానుంది. ఇందులో మరింత బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, అధునాతన ఎల్ఈడీ లైటింగ్, కొత్త కేబిన్ డిజైన్ ఉండనున్నాయి. టెక్నాలజీ పరంగా 12.3 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు లెవెల్-2 ఏడిఏఎస్ (ADAS) భద్రతా ఫీచర్లు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌కు మైల్డ్ హైబ్రిడ్ సాంకేతికతను జోడించడంతో పాటు, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ వర్షన్‌ను కూడా పరిశీలిస్తున్నారు.

4. టయోటా కోరోల్లా క్రాస్ 7-సీటర్

గ్లోబల్ మార్కెట్లో మంచి విజయం సాధించిన కోరోల్లా క్రాస్‌ను భారత్ కోసం ప్రత్యేకంగా 7-సీటర్ ఎస్‌యూవీగా తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. 2028 నుంచి 2029 మధ్యకాలంలో రానున్న ఈ వాహనం వీల్‌బేస్, అంతర్జాతీయ 5-సీటర్ మోడల్ కంటే దాదాపు 150మిమీ ఎక్కువగా ఉండనుంది. ఇది మూడో వరుసలో కూర్చునే వారికి తగినంత స్థలాన్ని అందిస్తుంది. ఇందులో 2.0-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనున్నారు. ఈ కారు హైరైడర్, ఫార్చ్యూనర్ మోడళ్ల మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేయనుంది.

5. టయోటా రూమియన్ ఫేస్‌లిఫ్ట్

సరసమైన ధరలో లభించే ఎమ్‌పీవీ రూమియన్ ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను 2026 చివరినాటికి విడుదల చేయడానికి సమాయత్తమవుతున్నారు. ఈ కొత్త మోడల్ పొడవు 4.39 మీటర్ల నుంచి 4.43 మీటర్లకు పెరగనుంది. ఈ మార్పు వల్ల ముఖ్యంగా సిఎన్‌జి వర్షన్‌లో లగేజ్ పెట్టుకోవడానికి ఎక్కువ స్థలం లభిస్తుంది. ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులతో పాటు ప్రయాణికుల భద్రత కోసం అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందించనున్నారు. ఇందులో ప్రస్తుత 1.5-లీటర్ పెట్రోల్ అలాగే సిఎన్‌జి ఇంజిన్ ఆప్షన్లే ఉండనున్నాయి.

6. టయోటా ఆల్-ఎలక్ట్రిక్ ఎంపీవీ

సుజుకి భాగస్వామ్యంతో తయారుకానున్న పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ 7-సీటర్ ఎంపీవీని 2028 నాటికి పరిచయం చేయనున్నారు. ఈ వాహనంలో 49kWh అలాగే 61kWh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌లు ఉండనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో డిజిటల్ డిస్‌ప్లేలు, పానోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక సౌకర్యాలు లభించనున్నాయి. ఇది భారత మార్కెట్లో టయోటా అందించబోయే రెండో ఎలక్ట్రిక్ వాహనంగా రికార్డు సృష్టించనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.