Upcoming SUVs: ఏడాది చివర్లో మార్కెట్లోకి 3 బాహుబలి ఎస్‌యూవీలు

Upcoming SUVs: సంవత్సరం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో భారతీయ కార్ల మార్కెట్ కొత్త మోడళ్ల రాకతో ఎంతో సందడిగా మారింది.

CR Reddy
Published on: 26 Oct 2026 1:29 PM IST
New Toyota Fortuner
X

New Toyota Fortuner

Upcoming SUVs: సంవత్సరం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో భారతీయ కార్ల మార్కెట్ కొత్త మోడళ్ల రాకతో ఎంతో సందడిగా మారింది. వినియోగదారుల నుంచి లభిస్తున్న విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు సరికొత్త వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇప్పటికే పలు అడ్వాన్స్డ్ కార్లు లాంచ్ కాగా, డిసెంబర్ నెలలో మరో మూడు అత్యంత శక్తివంతమైన బాహుబలి ఎస్‌యూవీ మోడళ్లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో టయోటా న్యూ జనరేషన్ ఫార్చ్యూనర్, హోండా మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అలాగే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నుంచి వస్తున్న కాంబ్యాట్ మోడల్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

నెక్స్ట్ జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్

ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న టయోటా ఫార్చ్యూనర్ సరికొత్త రూపంలో రాబోతోంది. సమాచారం ప్రకారం డిసెంబర్ 1వ తేదీన ఈ నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ గ్లోబల్ డెబ్యూ జరగనుంది. అప్‌డేటెడ్ ఐఎమ్‌వి (IMV) లాడర్ ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌పై రూపుదిద్దుకున్న ఈ కారు ముందు భాగంలో కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్లు, సరికొత్త గ్రిల్ అలాగే రీడిజైన్ చేసిన బంపర్ ఉంటాయి. ఇంజిన్ పరంగా 2.7 లీటర్ పెట్రోల్ తో పాటు 2.8 లీటర్ డీజిల్ మైల్డ్-హైబ్రిడ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది మెరుగైన మైలేజ్, పవర్ ఆఫర్ చేస్తుందని కంపెనీ భావిస్తోంది.

హోండా 0 ఆల్ఫా

ప్రముఖ జపాన్ వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్ కోసం తన మొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించబోతోంది. డిసెంబర్ 2వ తేదీన హోండా 0 ఆల్ఫా పేరుతో రానున్న ఈ ఈవీని కంపెనీ పరిచయం చేయనుంది. బాక్సీ డిజైన్, ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఈ కారు అందరినీ ఆకట్టుకోనుంది. దీని కేబిన్ లోపల పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు అలాగే పానోరమిక్ సన్‌రూఫ్ వంటి హైఎండ్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో 65kWh, 75kWh సామర్థ్యం గల రెండు ఎల్‌ఎఫ్‌పి బ్యాటరీ ప్యాక్‌లు ఇస్తారని, ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే 450 నుంచి 500 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ లభిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

జేఎస్‌డబ్ల్యూ కాంబ్యాట్ ప్రీమియం ఎస్‌యూవీ

భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ కూడా డిసెంబర్ 3 లేదా 4వ తేదీలలో సొంత ఇండిపెండెంట్ కార్ బ్రాండ్‌ను అధికారికంగా పరిచయం చేయనుంది. దీనికోసం ప్రముఖ చైనీస్ ఆటో మొబైల్ కంపెనీ చెరీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి ఎస్‌యూవీ జెటోర్ టి2 మోడల్ ఆధారంగా రూపొందుతోంది. భారతదేశంలో దీనిని కాంబ్యాట్ పేరుతో విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ తో కూడిన పవర్‌ఫుల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్‌తో రాబోతున్న ప్రీమియం ఎస్‌యూవీ.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.