రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి పవర్‌ఫుల్ బైక్.. హిమాలయన్ 750 వచ్చేసింది!

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తమ అతిపెద్ద బైక్ హిమాలయన్ 750ను భారత్‌లో విడుదల చేసింది. ఈఐసీఎంఏ 2026లో ప్రపంచవ్యాప్తంగా తొలిసారి ప్రదర్శించిన తర్వాత, వాగేటర్‌లో జరిగిన మోటోవర్స్ వేదికగా ఈ బైక్‌ను ప్రదర్శించింది.

G Krishna
Published on: 28 Nov 2026 4:37 PM IST
Royal Enfield
X

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి పవర్‌ఫుల్ బైక్.. హిమాలయన్ 750 వచ్చేసింది!

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తమ అతిపెద్ద బైక్ హిమాలయన్ 750ను భారత్‌లో విడుదల చేసింది. ఈఐసీఎంఏ 2026లో ప్రపంచవ్యాప్తంగా తొలిసారి ప్రదర్శించిన తర్వాత, వాగేటర్‌లో జరిగిన మోటోవర్స్ వేదికగా ఈ బైక్‌ను ప్రదర్శించింది. వీల్ కాన్ఫిగరేషన్, యాక్సెసరీలను బట్టి మూడు వేరియంట్లు, ఐదు రంగుల ఆప్షన్లలో ఇది అందుబాటులోకి వచ్చింది.

వేరియంట్లు, రంగులు, ఎక్స్-షోరూమ్ ధరలు

హిమాలయన్ 750 మూడు వేరియంట్లలో లభిస్తుంది. అల్లాయ్ వీల్స్ వేరియంట్ ధర రూ. 4.89 లక్షలు, ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్ వేరియంట్ ధర రూ. 5.14 లక్షలు, జీఐవీఐ యాక్సెసరీలతో వచ్చే టాప్ వేరియంట్ ధర రూ. 6.29 లక్షలుగా నిర్ణయించారు. ఎంట్రీ లెవల్ వేరియంట్ అల్లాయ్ వీల్స్‌తో అజ్టెక్ గ్రీన్, టెక్టోనిక్ బ్లాక్ రంగుల్లో వస్తుంది.

మిడిల్ వేరియంట్ ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వీల్స్‌తో వైకింగ్ బ్రాంజ్, సైబీరియా వైట్ రంగుల్లో లభిస్తుంది. టాప్ వేరియంట్ అంటార్కిటిక్ సిల్వర్ రంగులో వస్తూ, టాప్ బాక్స్, పానియర్స్ వంటి జీఐవీఐ యాక్సెసరీలతో పాటు హీటెడ్ గ్రిప్స్, హ్యాండ్‌గార్డ్స్, అల్యూమినియం స్కిడ్ ప్లేట్‌ను కలిగి ఉంటుంది. ఇతర రంగుల వేరియంట్లకు కూడా ఈ యాక్సెసరీలను విడిగా కొనుగోలు చేసుకోవచ్చు.

కొత్త 743సీసీ ఇంజిన్.. పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే

ఇందులో కొత్త 743సీసీ పారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. కంపెనీ వద్ద ఉన్న 648సీసీ ట్విన్-సిలిండర్ ఇంజిన్‌నే పెద్దది చేసి, విస్తృత మార్పులతో దీనిని రూపొందించారు. ఈ ఇంజిన్ 7,000 ఆర్పీఎం వద్ద 55 హెచ్‌పీ పవర్, 5,000 ఆర్పీఎం వద్ద 63 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ ఆర్పీఎం నుంచే అంటే 3,500 ఆర్పీఎం వద్దే 90 శాతం పీక్ టార్క్ అందుబాటులోకి వస్తుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది.

ఇది తక్కువ వేగంతో నడిపేటప్పుడు, లాంగ్ టూర్ల సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని, ఐడిల్ వేగం 1,300 ఆర్పీఎం వద్ద ఉంటుందని పేర్కొంది. భారత్‌లో వస్తున్న కొత్త 750సీసీ బైక్‌లలో ఇదే మొదటిది కాగా, కాంటినెంటల్ జీటీ 750పైనా కంపెనీ పనిచేస్తోంది కానీ దాని విడుదల వివరాలను ఇంకా ప్రకటించలేదు.

ఫీచర్లు, బ్రేకింగ్, సస్పెన్షన్ వివరాలు

హిమాలయన్ 750లో క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్-సెన్సిటివ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్‌ను కూడా ఇచ్చారు, ఇది ప్రస్తుత రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల హెడ్‌లైట్ కంటే మరింత శక్తివంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు ఉండగా, సస్పెన్షన్ కోసం అడ్జస్టబుల్ షోవా యూనిట్లను ఉపయోగించారు. మూడు వేరియంట్లలోనూ ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల వీల్స్ ఉంటాయి. అల్లాయ్ వీల్ వెర్షన్‌కు సీఏటీ క్రాస్‌రాడ్ ఏటీ టైర్లు, ట్యూబ్‌లెస్ క్రాస్-స్పోక్ వేరియంట్లకు వ్రెడెస్టైన్ సెంటారో ఎక్స్ఆర్ టైర్లను అమర్చారు.

దశలవారీ బుకింగ్‌లు.. డెలివరీలపై స్పష్టత లేదు

హిమాలయన్ 750 బుకింగ్‌లను దశలవారీగా ప్రారంభించనున్నారు. నవంబర్ 29 నుంచి మోటోవర్స్‌కు హాజరయ్యే వారికి ప్రత్యేకంగా బుకింగ్‌లు అందుబాటులోకి రాగా, దేశంలోని ఇతర ప్రాంతాల కస్టమర్లు డిసెంబర్ 1 నుంచి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఎప్పటి నుంచి మొదలవుతాయనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రకటించిన ఈ మూడు వేరియంట్ల ధరలు ఇంట్రడక్టరీ మాత్రమే కావడంతో, భవిష్యత్తులో మారే అవకాశం ఉంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.