Mahindra: టాటా, హ్యుందాయ్‌లకు దడ.. నంబర్-2 నేనే అంటున్న మహీంద్రా
Mahindra: మహీంద్రా కంపెనీ 2026 మొదటి తొమ్మిది నెలల్లో 5.41 లక్షలకు పైగా SUVలను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది.
Mahindra SUV
Mahindra: భారత SUV మార్కెట్‌లో మహీంద్రా కంపెనీ సంచలన విజయాలతో దూసుకుపోతోంది. సేల్స్ విషయంలో మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలను సైతం మహీంద్రా వెనక్కి నెట్టేస్తోంది. 2026 క్యాలెండర్ ఇయర్ మొదటి తొమ్మిది నెలల్లోనే 5.41 లక్షలకు పైగా కార్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. జనవరి నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో మహీంద్రా ఏకంగా 5,41,942 SUVలను కస్టమర్లకు అందించింది. గత ఏడాది అంటే 2025 ఇదే సమయంలో జరిగిన 4,46,697 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన ఏకంగా 21 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ మొత్తం అమ్మకాలలో BE 6, XEV 9e, XEV 9S వంటి ఎలక్ట్రిక్ SUVలు 50,835 యూనిట్లు ఉండటం విశేషం.
సరికొత్త ఆల్-టైమ్ రికార్డు దిశగా
గత ఏడాది 6,25,603 యూనిట్ల విక్రయాలతో మహీంద్రా నమోదు చేసిన ఆల్-టైమ్ రికార్డును అధిగమించడానికి మరో 83,662 కార్ల అమ్మకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరం ఆఖరి త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) లో పండుగల సీజన్ డిమాండ్ తోడుకానుంది. దీంతో ఈ క్యాలెండర్ ఇయర్ ముగిసేసరికి మహీంద్రా ఏకంగా 7.25 లక్షల SUV అమ్మకాల మార్కును అందుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నెలవారీ అమ్మకాల వర్సెస్ గ్రోత్ లెక్కలు
ఈ ఏడాది అమ్మకాల జోరును పరిశీలిస్తే జనవరిలో 63,510 యూనిట్లు (25% గ్రోత్), ఫిబ్రవరిలో 60,018 (19%), మార్చిలో 60,272 (25%), ఏప్రిల్‌లో 56,331 (8%), మే నెలలో 58,021 (11%), జూన్‌లో 60,393 (28%), జులైలో 60,048 (20%), ఆగస్టులో అత్యధికంగా 59,257 (50%), సెప్టెంబర్‌లో 64,092 యూనిట్లు (14% గ్రోత్) విక్రయించింది. ఈ లెక్కలు చూస్తే ప్రతీ నెల క్రమం తప్పకుండా 60 వేల మార్కును తాకినట్లు స్పష్టమవుతోంది.
నంబర్-2 స్థానం కోసం హోరాహోరీ పోరు
భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో మారుతి సుజుకి మొదటి స్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. 2024లో హ్యుందాయ్ రెండో స్థానంలో ఉండగా, 2025 నాటికి మహీంద్రా 6.25 లక్షల కార్ల విక్రయాలతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. టాటా మోటార్స్ మూడో స్థానానికి, హ్యుందాయ్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాయి. ఇప్పుడు 2026 లోనూ మహీంద్రా తన నంబర్-2 పొజిషన్‌ను మరింత బలంగా సుస్థిరం చేసుకుంటోంది.




