Kawasaki: బైక్ లవర్స్ కి గుడ్‌న్యూస్.. మార్కెట్లోకి కవాసాకి జెడ్300 ఎంట్రీ
Kawasaki: ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ కవాసాకి భారతీయ మార్కెట్లో మరో అద్భుతమైన బైక్‌ను విడుదల చేసింది.
Kawasaki Z300
Kawasaki: ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ కవాసాకి భారతీయ మార్కెట్లో మరో అద్భుతమైన బైక్‌ను విడుదల చేసింది. జెడ్ సిరీస్‌లో భాగంగా అత్యంత తక్కువ ధరకు లభించే స్ట్రీట్-నేకెడ్ బైక్ జెడ్300 అధికారికంగా లాంచ్ అయింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.3.24 లక్షలుగా నిర్ణయించారు. నింజా 300 మోడల్ ఇంజిన్ ప్లాట్‌ఫారమ్‌ను ఆధారంగా చేసుకుని దీనిని రూపొందించినప్పటికీ, దీని డిజైన్ మాత్రం మరింత దూకుడుగా, మస్క్యులర్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆకట్టుకునే డిజైన్, అడ్వాన్స్‌డ్ ఇంజిన్ పవర్
ఈ బైక్ రూపకల్పనలో కవాసాకి సంస్థ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సిగ్నేచర్ జెడ్-షేప్ హెడ్‌లైట్, పెద్ద సైజు ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ ఈ బైక్‌కు సరికొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. క్యాండీ లైమ్ గ్రీన్, మెటాలిక్ కార్బన్ గ్రే అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఇందులో 296సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది అద్భుతమైన పవర్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి తోడుగా 6 స్పీడు గేర్‌బాక్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ స్టాండర్డ్ ఫీచర్‌గా అందించారు.
బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్ ప్రత్యేకతలు
రైడర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీంట్లో పటిష్టమైన సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ముందువైపు 37ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు యూనీ-ట్రాక్ మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. రోడ్డుపై గ్రిప్ కోసమని 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. అలాగే డ్యూయల్-చానల్ ఏబీఎస్‌తో కూడిన పెటల్ డిస్క్ బ్రేకులు దీని ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పదిహేడు లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉండటం వల్ల సుదూర ప్రయాణాలకు కూడా ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
కేటీఎం 390 డ్యూక్‌కు గట్టి పోటీ
భారత మార్కెట్లో ఈ సరికొత్త బైక్ నేరుగా కేటీఎం 390 డ్యూక్ మోడల్‌తో పోటీ పడనుంది. కేటీఎం బైక్‌తో పోలిస్తే దీని ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ అందించే స్మూత్ రైడింగ్ అనుభవం దీని సొంతం. ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ద్వారా అవసరమైన అన్ని సమాచారాలు సులభంగా తెలుసుకోవచ్చు. సరసమైన ధరలో ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే బైక్ ప్రియులకు ఈ మోడల్ అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.




