JSW Combat SUV: ఫార్చ్యూనర్‌కు చెక్ పెట్టేందుకు వస్తున్న కారు.. ఈ 5 ఫీచర్లు అదిరిపోతాయ్

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ త్వరలో ఎంట్రీ ఇవ్వబోతోంది. కంపెనీ తీసుకొస్తున్న మొదటి ఎస్‌యూవీ కాంబాట్ పై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

CR Reddy
Published on: 24 Nov 2026 11:58 AM IST
JSW Combat SUV: ఫార్చ్యూనర్‌కు చెక్ పెట్టేందుకు వస్తున్న కారు.. ఈ 5 ఫీచర్లు అదిరిపోతాయ్
X

JSW Combat SUV: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ త్వరలో ఎంట్రీ ఇవ్వబోతోంది. కంపెనీ తీసుకొస్తున్న మొదటి ఎస్‌యూవీ కాంబాట్ పై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండు దశాబ్దాలుగా భారత రోడ్లపై తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న టయోటా ఫార్చ్యూనర్‌కు ఈ కారు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫార్చ్యూనర్ తన స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్, నమ్మకమైన ఇంజిన్, రీసేల్ విలువతో మార్కెట్‌ను ఏలుతోంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో జెట్‌టూర్ టీ2 పేరుతో అమ్ముడవుతున్న ఈ కారు భారత్‌లో కాంబాట్‎గా వస్తే ఫార్చ్యూనర్‌కు టెన్షన్ తప్పదని నిపుణులు అంటున్నారు.

1. డీజిల్ భయం లేని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్

ఫార్చ్యూనర్‌కు ఉన్న ప్రధాన బలం దాని డీజిల్ ఇంజిన్ అయినా, కొన్ని నగరాల్లో అదే దానికి బలహీనతగా మారుతోంది. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ లాంటి ప్రాంతాల్లో 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలపై నిషేధం ఉండటంతో, ఎక్కువ కాలం కారు ఉంచుకోవాలనుకునేవారు ఆలోచిస్తున్నారు. అయితే జేఎస్‌డబ్ల్యూ కాంబాట్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అద్భుతమైన మైలేజీ లభించడమే కాకుండా రన్నింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది. పైగా డీజిల్ కార్లపై ఉండే ప్రభుత్వ ఆంక్షల భయం కూడా ఉండదు.

2. అధునాతన టెక్నాలజీతో కూడిన కొత్త క్యాబిన్

ఎన్ని అప్‌డేట్లు ఇచ్చినా ఫార్చ్యూనర్ ఇంటీరియర్ మాత్రం కొంత పాతదిగా అనిపిస్తుంటుంది. సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసే కస్టమర్లు పెద్ద టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ADAS సేఫ్టీ ఫీచర్లు, లగ్జరీ ఇంటీరియర్ కోరుకుంటారు. జేఎస్‌డబ్ల్యూ కాంబాట్ కచ్చితంగా ఈ ఆధునిక హంగులతోనే రానుంది. కాబట్టి క్యాబిన్, టెక్నాలజీ పరంగా ఫార్చ్యూనర్ కంటే కాంబాట్ చాలా ముందుంటుంది.

3. ఫార్చ్యూనర్‌కు దీటుగా బాక్సీ రోడ్ ప్రెజెన్స్

భారీ ఆకారం, రోడ్డుపై వెళ్తుంటే అందరూ తిరిగి చూసే లుక్ ఉండటమే ఫార్చ్యూనర్ ప్రత్యేకత. అయితే జేఎస్‌డబ్ల్యూ కాంబాట్ కూడా అందుకు ఏమాత్రం తీసిపోదు. బాక్సీ డిజైన్, ఎత్తైన స్టాన్స్, వెడల్పైన బాడీ, రగ్గడ్ లుక్‌తో ఇది చాలా మస్క్యులర్‌గా కనిపిస్తుంది. మన దేశంలో పెద్దగా, గంభీరంగా కనిపించే ఎస్‌యూవీలకు విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి దీని డిజైన్ కస్టమర్లను సులభంగా ఆకట్టుకుంటుంది.

4. గ్లోబల్ మార్కెట్లో నిరూపించుకున్న కారు

కొత్త కంపెనీ నుంచి వస్తున్నా కాంబాట్ ఏదో కొత్తగా ప్రయోగం చేస్తున్న ప్రొడక్ట్ కాదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇది ఇప్పటికే 'జెట్‌టూర్ టీ2' పేరుతో విజయవంతంగా అమ్ముడవుతోంది. అంటే భారత్‌కు రాకముందే ప్రపంచవ్యాప్తంగా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. కాబట్టి కస్టమర్లు ఎలాంటి సందేహం లేకుండా ఒక నమ్మకమైన గ్లోబల్ మోడల్‌ను ఎంచుకునే అవకాశం దొరుకుతుంది.

5. ఫార్చ్యూనర్ కంటే తక్కువ ధర

టయోటా ఫార్చ్యూనర్ టాప్ వేరియంట్ల ధరలు ఇప్పుడు లగ్జరీ కార్ల స్థాయికి చేరిపోయాయి. ఇలాంటి సమయంలో జేఎస్‌డబ్ల్యూ కాంబాట్ ధర దాని విజయంలో కీలక పాత్ర పోషించనుంది. మీడియా నివేదికల ప్రకారం దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.35 లక్షల వద్ద ఉండొచ్చు. అంత తక్కువ ధరలో హైబ్రిడ్ ఇంజిన్, ఆధునిక ఫీచర్లు అందిస్తే మాత్రం ఫార్చ్యూనర్ కొనుగోలుదారులు కచ్చితంగా కాంబాట్ వైపు చూసే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.