Upcoming EVs: కార్ లవర్లకు గుడ్‌న్యూస్.. మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్న 5 పవర్‌ఫుల్ ఈవీలు

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల హవా వేగంగా పుంజుకుంటోంది. త్వరలోనే టాటా సఫారీ ఈవీ, ఎమ్‌జీ ఎస్5, రెనో బ్రిజర్ ఈవీ, జేఎస్‌డబ్ల్యూ ఐకార్ వి23, మహింద్రా బిఈ 07 మోడళ్లు లాంచ్ కానున్నాయి.

CR Reddy
Published on: 27 Oct 2026 10:10 AM IST
Upcoming EVs
X

Upcoming EVs

Upcoming EVs: దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ వాహన తయారీ సంస్థలు సరికొత్త ఈవీ మోడళ్లను భారత రోడ్లపైకి తెచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేలా భారీ రేంజ్, అత్యాధునిక ఫీచర్లతో పలు టాప్ బ్రాండ్లు కొత్త కార్లను రూపొందిస్తున్నాయి. అందులో టాటా మోటార్స్, మహింద్రా, ఎమ్‌జీ, రెనోతో పాటు జేఎస్‌డబ్ల్యూ కంపెనీలు తయారు చేస్తున్న 5 ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు అతిత్వరలోనే భారత మార్కెట్లో సందడి చేయబోతున్నాయి.

టాటా సఫారీ EV

టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ సఫారీ ఆధారంగా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు రోడ్లపై టెస్టింగ్ జరుపుకున్న ఈ కారు, భారతదేశంలో కంపెనీ అందిస్తున్న మొదటి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కానుంది. ఇందులో సియెర్రా ఈవీ తరహాలోనే ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికొస్తే 65kWh, 75kWh కెపాసిటీ గల రెండు ఆప్షన్లను అందించనున్నారు. చిన్న బ్యాటరీ వేరియంట్ సుమారు 538 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ ఏకంగా 622 నుండి 627 కిలోమీటర్ల భారీ మైలేజ్ అందిస్తుందని అంచనా వేస్తున్నారు.

MG S5 EV, రెనో బ్రిజర్ ఈవీ

ఎమ్‌జీ మోటార్స్ తన ప్రాచుర్యం పొందిన జెడ్ఎస్ ఈవీ స్థానంలో కొత్త ఎస్5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. 49kWh, 64kWh బ్యాటరీ ఆప్షన్లతో రానున్న ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఇందులో 15.6 అంగుళాల డిస్ప్లే, లెవెల్-2 అడాస్ సెక్యూరిటీ సిస్టమ్ అమర్చారు. మరోవైపు రెనో సంస్థ తన సబ్-4 మీటర్ కాన్సెప్ట్ ఆధారంగా 'బ్రిజర్ ఈవీ'ని రూపొందిస్తోంది. మల్టీ-ఎనర్జీ ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న ఈ కారు పెట్రోల్ వెర్షన్ తర్వాత ఎలక్ట్రిక్ వేరియంట్‌లో పండుగ సీజన్ నాటికి విడుదల కానుంది.

JSW iCar V23

భారత మార్కెట్లో అడుగుపెడుతున్న జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ కంపెనీ డిసెంబర్ నాటికి తన ఉనికిని చాటుకుని, వచ్చే ఏడాది మొదటి ఈవీని విడుదల చేయనుంది. చైనాకు చెందిన చెరీ ఐకార్ వి23 ప్రాతిపదికన ఇది రూపుదిద్దుకుంటోంది. గ్లోబల్ మోడల్‌లో 59.93kWh, 81.76kWh బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తున్నారు. ఇవి వరుసగా 401 కిలోమీటర్లు, 510 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. పనోరమిక్ సన్‌రూఫ్, ఆల్-వీల్ డ్రైవ్ వంటి ఆప్షన్లతో రానున్న ఈ కారు భారత్‌లో గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

మహింద్రా BE 07

మహింద్రా కూడా తన ప్రతిష్టాత్మక బిఈ 07 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పనులను వేగవంతం చేసింది. భావి తరానికి తగ్గట్టుగా ఉన్న దీని కాన్సెప్ట్ డిజైన్‌ను ప్రొడక్షన్ వెర్షన్‌లోనూ దాదాపు అలాగే ఉంచనున్నారు. కారు క్యాబిన్ లోపల ట్రిపుల్-స్క్రీన్ సెటప్, విశాలమైన గ్లాస్ రూఫ్, ఫ్రేమ్‌లెస్ డోర్లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. దీనికోసం కంపెనీ 59kWh, 70kWh, 79kWh సామర్థ్యం ఉన్న పవర్‌ఫుల్ బ్యాటరీ ఆప్షన్లను పరిశీలిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.