Hyundai: సింగిల్ ఛార్జ్‌పై 355 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నుంచి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఎస్యూవీ
Hyundai: హ్యుందాయ్ కంపెనీ సరికొత్త చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ అయోనిక్ పి ని భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది.
Hyundai Ioniq P EV
Hyundai: భారత ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ త్వరలోనే సరికొత్త ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. కోడ్‌నేమ్ HE1iతో తయారవుతున్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి అయోనిక్ పి అని పేరు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ఎంతో గుర్తింపు పొందిన అయోనిక్ సిరీస్‌లో ఇది అత్యంత తక్కువ ధరకే లభించే ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించనుంది. 2026 మూడో త్రైమాసికం ఆర్థిక నివేదికల సందర్భంగా కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని వెల్లడించింది.
డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్లు.. 355 కిమీ రేంజ్
హ్యుందాయ్ అయోనిక్ పి కారును గ్లోబల్ ఇన్‌స్టర్ ఈవీ ఉపయోగించే E-GMP (K) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిస్తున్నారు. ఇది స్టాండర్డ్, లాంగ్ రేంజ్ అనే రెండు రకాల ఆప్షన్లలో లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇన్‌స్టర్ ఈవీ 42kWh, 49kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంది. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై గరిష్టంగా 355 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. భారత మార్కెట్‌కు తీసుకొచ్చే ఈ కొత్త కారులో కూడా ఇదే తరహా బ్యాటరీ సామర్థ్యాన్ని అందించే అవకాశం ఉంది.
తమిళనాడులో తయారీ.. స్థానిక బ్యాటరీల వాడకం
తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో ఈ చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ద్వారా స్థానికంగానే బ్యాటరీ సెల్స్‌ను సమకూర్చుకోవాలని హ్యుందాయ్ ప్రణాళికలు రచించింది. ఈ విధానం వల్ల విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు కారు ధర సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలోనే ఈవీలను అందించడం ద్వారా విక్రయాల వాటాను భారీగా పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.
లెవెల్-2 అడాస్ టెక్నాలజీ.. అత్యాధునిక ఫీచర్లు
హ్యుందాయ్ ఈ కొత్త ఈవీలో నెక్స్ట్ జనరేషన్ ప్లియోస్ కనెక్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు లెవెల్-2 అడాస్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఈ అధునాతన భద్రతా సాంకేతికత డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తుంది. అతి తక్కువ ధరలో వస్తున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ కావడంతో మధ్యతరగతి వాహన ప్రియులను ఈ మోడల్ ఎంతగానో ఆకట్టుకునే అవకాశం ఉంది. 2027 జనవరి నాటికి ఈ కారును అధికారికంగా మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టాటా నెట్ వర్క్‌కు గట్టి పోటీ
మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ చిన్న ఎస్యూవీ నేరుగా టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీ, కియా సిరోస్ ఈవీ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. సరసమైన ధర, ఎక్కువ రేంజ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న ఈ కార్ భారత్‌లో ఈవీ విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తుందని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు.




