Hyundai: 2027లో హ్యుందాయ్ నుంచి 4 కొత్త SUVలు.. లిస్ట్‌లో కొత్త క్రెటా, ఎలక్ట్రిక్ మోడల్

హ్యుందాయ్ 2027లో భారత మార్కెట్లో నాలుగు కొత్త SUVలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఐయోనిక్ P ఎలక్ట్రిక్ SUVలో 51.4kWh వరకు బ్యాటరీ, 450 కిలోమీటర్ల వరకు అంచనా రేంజ్ ఉండవచ్చు.

CR Reddy
Published on: 29 Nov 2026 11:25 AM IST
Hyundai: 2027లో హ్యుందాయ్ నుంచి 4 కొత్త SUVలు.. లిస్ట్‌లో కొత్త క్రెటా, ఎలక్ట్రిక్ మోడల్
X

Hyundai: భారత కార్ల మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని హ్యుందాయ్ భావిస్తోంది. ఇందులో భాగంగా 2030 నాటికి లగ్జరీ కార్లతో కలిపి మొత్తం 26 కొత్త మోడళ్లను తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ విభాగాల్లో కొత్త కార్లను అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా 2027లో SUVలపై ఎక్కువ దృష్టి పెట్టనుంది. వచ్చే ఏడాది ఐయోనిక్ P, బేయాన్ CNG, కొత్త తరం క్రెటా, క్రెటా ఎలక్ట్రిక్ మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురావచ్చని అంచనా.

300 నుంచి 450 కిలోమీటర్ల రేంజ్‌తో ఐయోనిక్ P

హ్యుందాయ్ ఐయోనిక్ P కంపెనీ భారత మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్న చిన్న ఎలక్ట్రిక్ SUVగా చెప్పుకోవచ్చు. దీని కోడ్‌నేమ్ HE1i. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవుతో బాక్సీ డిజైన్‌లో ఈ కారు రానుంది. 2027లో భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో దీన్ని పరిచయం చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, Pleos Connect సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ ఏసీ, ADAS వంటి ఫీచర్లు ఉండవచ్చని సమాచారం. బ్యాటరీ విషయానికి వస్తే 42kWh, 49kWh లేదా 51.4kWh ఆప్షన్లు రావచ్చని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 నుంచి 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలుస్తోంది.

జనవరి 2027లో బేయాన్ CNG

ఇటీవల మార్కెట్లోకి వచ్చిన హ్యుందాయ్ బేయాన్‌కు CNG వెర్షన్ కూడా రానుంది. 2027 జనవరిలో ఈ మోడల్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను CNGకి అనుగుణంగా మారుస్తారు. ఈ కారులో మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. CNG సిలిండర్‌ను కారు కింద అమర్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల డిక్కీలో లగేజీ పెట్టుకునే స్థలం తగ్గకుండా ఉంటుంది. పెట్రోల్ మోడల్‌లో ఉన్న చాలా ఫీచర్లు ఇందులోనూ ఉండవచ్చు.

కొత్త తరం క్రెటాలో హైబ్రిడ్ ఇంజిన్?

హ్యుందాయ్ క్రెటా కొత్త తరం మోడల్‌ను 2027 మొదటి ఆరు నెలల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుంది. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే పరిమాణంలో పెద్దదిగా ఉండనుంది. డిజైన్‌లోనూ మార్పులు కనిపించవచ్చు. ఇందులో Pleos Connect, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు, బాస్ మోడ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉండవచ్చని సమాచారం. ఇంజిన్ ఆప్షన్లలో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ కొనసాగవచ్చు. వీటితో పాటు 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. క్రెటా N Line మోడల్‌ను కూడా కంపెనీ పరీక్షిస్తున్నట్లు సమాచారం.

2027 చివర్లో కొత్త క్రెటా ఎలక్ట్రిక్

పెట్రోల్, హైబ్రిడ్ మోడళ్లతో పాటు కొత్త తరం క్రెటా ఎలక్ట్రిక్‌ను కూడా హ్యుందాయ్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారును రోడ్లపై పరీక్షిస్తున్నట్లు సమాచారం. సాధారణ క్రెటా కొత్త మోడల్ తరహాలోనే దీని డిజైన్ ఉండవచ్చు. అయితే ఎలక్ట్రిక్ కారుకు తగినట్లుగా ప్రత్యేక గ్రిల్, అల్లాయ్ వీల్స్, క్యాబిన్ డిజైన్‌లో మార్పులు చేయనున్నారు. కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే ఈ కారులో ప్రస్తుత మోడల్ కంటే పెద్ద బ్యాటరీ, మెరుగైన రేంజ్ ఉండవచ్చని అంచనా. 2027 చివరి నాటికి ఈ ఎలక్ట్రిక్ SUV మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.