Hero Splendor: బైక్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ సునామీ.. ఆరు నెలల్లో ఏకంగా 21 లక్షలకు పైగా బైక్‌ల విక్రయం

Hero Splendor: భారత టూ వీలర్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ సరికొత్త రికార్డులతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.

CR Reddy
Published on: 31 Oct 2026 11:22 AM IST
Hero Splendor Sales
X

Hero Splendor Sales

Hero Splendor: భారత టూ వీలర్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ సరికొత్త రికార్డులతో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆర్థిక సంవత్సరం 2027 మొదటి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో ఈ బైక్ ఏకంగా 21.30 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలతో దేశంలోనే నంబర్ వన్ మోడల్‌గా నిలిచింది. సగటున ప్రతిరోజూ సుమారు 11,836 మంది ఈ బైక్‌ను కొనుగోలు చేయడం గమనార్హం. హోండా షైన్, బజాజ్ పల్సర్ వంటి ప్రముఖ బైక్‌లను వెనక్కి నెట్టి స్ప్లెండర్ సేల్స్ పరంగా అగ్రస్థానంలో దూసుకెళ్తోంది.

హోండా షైన్ కంటే డబుల్ సేల్స్

ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 మధ్య హీరో స్ప్లెండర్ మొత్తం 21,30,637 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన 17,80,081 యూనిట్లతో పోలిస్తే ఇది భారీ వృద్ధి. మరోవైపు రెండవ స్థానంలో ఉన్న హోండా షైన్ 125, ఎస్పీ 125 మోడళ్లు రెండూ కలసి మొత్తం 9,65,571 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే షైన్ కంటే హీరో స్ప్లెండర్ ఏకంగా 11,65,066 యూనిట్లు అదనంగా అమ్ముడై రేసులో చాలా దూరంలో నిలిచింది.

టాప్ సేల్స్ సాధించిన ప్రముఖ బైక్‌లు

దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ బైక్‌ల జాబితాలో బజాజ్ పల్సర్ 6,33,015 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది. టీవీఎస్ అపాచీ 3,34,347 యూనిట్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ 2,43,132 యూనిట్లు, హోండా సీబీ యూనికార్న్ 2,28,721 యూనిట్ల సేల్స్ సాధించాయి. టీవీఎస్ రోనిన్ బైక్ అమ్మకాలు కూడా పుంజుకుని 61,829 యూనిట్లకు చేరాయి. హీరో కంపెనీకి చెందిన ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ మోడల్ 96,194 యూనిట్లు అమ్ముడవగా, టీవీఎస్ రేడియాన్ 86,805 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

కొద్దిగా తగ్గిన కొన్ని పాపులర్ మోడళ్ల డిమాండ్

కొన్ని ప్రముఖ బైక్‌ల విక్రయాలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. హీరో ప్యాషన్ సేల్స్ 1,24,952 యూనిట్ల నుంచి 1,15,369 యూనిట్లకు పడిపోయాయి. హోండా షైన్ 100 మోడల్ విక్రయాలు 1,09,887 నుంచి 1,02,833 యూనిట్లకు తగ్గాయి. యమహా ఎఫ్‌జెడ్ 78,124 యూనిట్లు, బాజాజ్ స్పోర్ట్ 72,564 యూనిట్ల వద్ద నిలిచాయి. పోటీ తీవ్రమైనప్పటికీ కాస్ట్ ఎఫెక్టివ్ మైలేజ్ విభాగంలో హీరో స్ప్లెండర్‌కు తిరుగులేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

సామాన్యుల మొదటి ఛాయిస్ స్ప్లెండర్

సరికొత్త డిజైన్లు, ఫీచర్లు ఉన్న బైక్‌లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ, మధ్యతరగతి కుటుంబాలకు స్ప్లెండర్ అందిస్తున్న మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, అత్యధిక రీసేల్ వ్యాల్యూ దీనికి ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా హీరో నెట్‌వర్క్ బలంగా ఉండటం వల్ల విక్రయాలు నిరంతరం పెరుగుతున్నాయి. పండుగ సీజన్ రాకతో రాబోయే రోజుల్లో ఈ బైక్ విక్రయాలు మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.