Electric Scooter: దేశంలోనే తొలి ఇంటెలిజెంట్ స్కూటర్ ఎంట్రీ.. హైదరాబాద్‌లోనే తయారీ
Electric Scooter: ఈవీ మార్కెట్లో సరికొత్త విప్లవానికి తెరలేపింది ప్రముఖ స్టార్టప్ సంస్థ E3 టెక్నాలజీస్.
Electric Scooter
Electric Scooter: ఈవీ మార్కెట్లో సరికొత్త విప్లవానికి తెరలేపింది ప్రముఖ స్టార్టప్ సంస్థ E3 టెక్నాలజీస్. హైదరాబాద్ ప్లాంట్‌లో తయారైన దేశంలోనే తొలి ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ E3 ట్రియాన్ ఉత్పత్తి ప్రారంభమైంది. అక్టోబర్ 7 నుంచే కస్టమర్లకు డెలివరీలు అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. 100 కంటే ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ ఫీచర్లతో వచ్చిన ఈ స్కూటర్ టీవీఎస్, బజాజ్, ఓలా, ఏథర్ లాంటి ప్రముఖ కంపెనీల మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ C1, C1x, C2 అనే మూడు వినూత్న వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ప్రారంభ వేరియంట్ C1 ధరను రూ.99,999గా నిర్ణయించారు. ఇందులో 2.3kWh బ్యాటరీ ప్యాక్, 2.5kW మోటార్ అమర్చారు. ఇది గరిష్టంగా గంటకు 67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ సింగిల్ ఛార్జ్‌పై 108 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. C1x వేరియంట్ ధర రూ.1,09,999 కాగా, ఇందులో 3kWh బ్యాటరీ ఇచ్చారు. ఇది ఏకంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
ఇక టాప్ వేరియంట్ C2 ధర రూ.1,19,999 గా ఉంది. ఇందులో 3.5kW మోటార్, 3kWh బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఇది గంటకు 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో వెళ్తూ 128 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. తొలి 100 మంది కస్టమర్లను ఫౌండింగ్-ఓనర్ కమ్యూనిటీ సభ్యులుగా చేర్చుకుని వారికి ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నారు. బ్యాటరీతో పాటు ఇతర ప్రధాన భాగాలపై 8 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు పొడిగించిన వారంటీని అందిస్తున్నారు. దీనితో పాటు వింగ్మాన్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం కల్పిస్తున్నారు.
సాధారణ పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఈ స్కూటర్ వాడకం వల్ల జేబుకు భారీగా డబ్బు ఆదా అవుతుందని కంపెనీ లెక్కలతో సహా వివరించింది. రోజుకు 50 కిలోమీటర్లు తిరిగే వ్యక్తి పెట్రోల్ కోసం నెలకు రూ.2,766 ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే E3 ట్రియాన్ స్కూటర్‌కు నెలకు రూ.315 విద్యుత్ ఛార్జింగ్ ఖర్చు మాత్రమే అవుతుంది. దీనివల్ల నెలకు రూ.2,451 చొప్పున ఏడాదికి సుమారు రూ.29,411 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రయాణ దూరం పెరిగే కొద్దీ ఈ ఆదా మొత్తం మరింత పెరుగుతుంది.
చౌకైన నిర్వహణ వ్యయం, మోడ్రన్ టెక్నాలజీ, ఆకర్షణీయమైన వారంటీ ఆఫర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ హైదరాబాద్ మేడ్ స్కూటర్ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో మార్కెట్ లీడర్లను ఢీకొట్టేందుకు సిద్ధమైన E3 ట్రియాన్ రాబోయే రోజుల్లో వాహన ప్రియులకు బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.




