Ducati: భారత్‌లోకి డుకాటి కొత్త అడ్వెంచర్ బైక్.. బుకింగ్స్ షురూ, ధర ఎంతో తెలుసా?

Ducati: ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ డుకాటి తమ సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ డెసర్ట్‌ఎక్స్ వి2 కొనుగోలుకు భారత్‌లో అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది.

CR Reddy
Published on: 8 Nov 2026 12:32 PM IST
Ducati DesertX V2
X

Ducati DesertX V2

Ducati: ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ బైక్ తయారీ సంస్థ డుకాటి తమ సరికొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ డెసర్ట్‌ఎక్స్ వి2 కొనుగోలుకు భారత్‌లో అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. ఈ విషయాన్ని కంపెనీ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అధికారికంగా ధ్రువీకరించింది. ఇటీవలే EICMA 2026 ఆటో ప్రదర్శనలో ప్రపంచానికి పరిచయమైన ఈ శక్తివంతమైన బైక్ త్వరలోనే దేశీయ షోరూమ్‌లకు రానుంది. భారత మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.19 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

కొత్త 890 సీసీ వి2 ఇంజిన్

డుకాటి డెసర్ట్‌ఎక్స్ వి2 మోడల్‌లో పాత 937 సీసీ ఇంజిన్ స్థానంలో సరికొత్త 890 సీసీ 90-డిగ్రీ V2 ఇంజిన్‌ను జతచేశారు. దీనితో పాటు మోనోకాక్ ఫ్రేమ్‌ను అందించడం వల్ల బైక్ దృఢత్వం మరింత పెరిగింది. ఈ నూతన ఇంజిన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 110.3 హెచ్‌పి పవర్, 7,000 ఆర్పీఎం వద్ద 92 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. క్లిష్టమైన ఆఫ్‌రోడ్ మార్గాల్లో లాంగ్ జర్నీలు చేసేందుకు అనువుగా 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో దీనిని రూపొందించారు.

అడ్వెంచర్ లవర్స్ కోసం స్పెషల్ వేరియంట్

సాధారణ మోడల్‌తో పాటు మరింత కఠినమైన ఆఫ్‌రోడ్ పరిస్థితులను తట్టుకునేలా డెసర్ట్‌ఎక్స్ ర్యాలీ వేరియంట్‌ను కూడా డుకాటి అందుబాటులోకి తెస్తోంది. ఇందులో 48 మిమీ కేవైబీ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్‌ను అమర్చారు. దీని ఫ్రంట్ వీల్ సస్పెన్షన్ ట్రావెల్‌ను 231 మిమీ నుంచి 249 మిమీ వరకు పెంచారు. ఈ ర్యాలీ వేరియంట్ సీటు ఎత్తు 878 మిమీగా ఉండటమే కాకుండా, పెట్రోల్ లేకుండా బైక్ బరువు 209 కేజీలుగా ఉంటుంది.

ఖరీదైన ఎక్సెల్ టకాసాగో వీల్స్

డెసర్ట్‌ఎక్స్ వి2 ర్యాలీ మోడల్‌లో తేలికపాటి ఎక్సెల్ టకాసాగో సెంటర్-స్పోక్ ట్యూబ్‌లెస్ రిమ్‌లను ఉపయోగించారు. గతుకుల రోడ్లు, రాళ్ల దారుల్లో ప్రయాణించేటప్పుడు చక్రాలు విరిగిపోకుండా అత్యంత బలంగా ఉండేలా 36 స్పోక్స్‌తో వెనుక చక్రాన్ని డిజైన్ చేశారు. పాత మోడళ్లతో పోలిస్తే ఇది సన్నగా ఉండటం వల్ల ఎలాంటి కఠిన మార్గాల్లోనైనా బైక్ సులువుగా దూసుకెళ్లడానికి సహాయపడుతుంది.

మోడ్రన్ రైడింగ్ ఫీచర్లు

ఈ కొత్త బైక్‌లో 5-ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లేతో పాటు క్రూయిజ్ కంట్రోల్ సదుపాయం కల్పించారు. కస్టమర్ల భద్రత కోసం కార్నరింగ్ ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, పవర్ మోడ్లు, రైడింగ్ మోడ్లు, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఎలక్ట్రానిక్ ఫీచర్లను అందించారు. ఇందులో ఉన్న బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ సహాయంతో క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకునే వెసులుబాటు ఉంది. బైక్ లవర్స్ ఇప్పుడు ఈ ప్రీమియం మోడల్ అధికారిక లాంచ్ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.