21 కిమీ మైలేజ్, 5 స్టార్ సేఫ్టీతో ఫుల్ సేఫ్టీ.. 8 లక్షలలోపే టాప్ 4 ఎస్‌యూవీలు..!

Best Suvs Under 8 Lakhs: భద్రత, మైలేజ్ కోసం టాటా నెక్సాన్, డ్రైవింగ్ అనుభూతి కోసం స్కోడా కైలాక్, నయా టెక్నాలజీ కోరుకునే వారికి హ్యుందాయ్ వెన్యూ సరైన ఎంపికగా నిలుస్తాయి.

Venkat
Updated on: 13 Aug 2026 3:54 PM IST
Best Suvs Under 8 Lakhs
X

21 కిమీ మైలేజ్, 5 స్టార్ సేఫ్టీతో ఫుల్ సేఫ్టీ.. 8 లక్షలలోపే టాప్ 4 ఎస్‌యూవీలు..!

Best Suvs Under 8 Lakhs: సొంత కారు కొనాలనేది ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబ కల. అయితే బడ్జెట్‌లో మంచి మైలేజ్, సేఫ్టీ, ఆధునిక ఫీచర్లు ఉన్న వాహనాన్ని ఎంచుకోవడం సవాలుగా మారుతుంది. 8 లక్షల పరిమితిలో కుటుంబాలకు సరిపోయే 4 అత్యుత్తమ మోడళ్లను ఓసారి చూద్దాం. మారుతున్న కాలానికి అనుగుణంగా మన దేశంలో కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు సాధారణ హ్యాచ్‌బ్యాక్ కార్ల వైపు చూసిన మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఎస్‌యూవీ వాహనాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, విశాలమైన కేబిన్ స్పేస్, మెరుగైన భద్రత వల్ల వీటి క్రేజ్ బాగా పెరిగింది. రూ. 8 లక్షల లోపు లభించే టాప్ కార్ల వివరాలు పరిశీలిద్దాం.



మారుతి సుజుకి బ్రెజ్జా: మారుతి సుజుకి సంస్థ నుంచి వచ్చిన బ్రెజ్జా ఎస్‌యూవీ మార్కెట్లో ముందంజలో ఉంది. ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నమోదైంది. దీనిలోని 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్ ప్రయాణాన్ని ఎంతో హాయిగా మారుస్తుంది. కేబిన్‌లో విశాలమైన లెగ్‌రూమ్‌తో పాటు లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్ ఆకట్టుకుంటాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, ఏబీఎస్ అందించారు. ఇది లీటరుకు 17 నుంచి 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.



టాటా నెక్సాన్: భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే వారికి టాటా నెక్సాన్ ఒక అద్భుతమైన ఎంపిక. రూ. 7.39 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ఈ మోడల్ గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. కారులో 10.25 అంగుళాల డిజిటల్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు అమర్చారు. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 17.5 కిమీ ఇవ్వగా, డీజిల్ వేరియంట్ ఏకంగా 23 నుంచి 24 కిమీ మైలేజ్ అందిస్తుంది.



స్కోడా కైలాక్: భారత మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన స్కోడా కైలాక్ తన ప్రత్యేక శైలితో ఆకట్టుకుంటోంది. దీని ప్రారంభ ధర రూ. 7.59 లక్షలుగా నిర్ణయించారు. 1.0 లీటర్ టీఎస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ 115 పీఎస్ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లాంగ్ డ్రైవ్స్ కోసం 446 లీటర్ల భారీ బూట్ స్పేస్ కేటాయించారు. 10.1 అంగుళాల స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సదుపాయాలు ఉన్నాయి. ప్రయాణికుల రక్షణకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రోల్‌ఓవర్ ప్రొటెక్షన్ సిస్టమ్ తోడ్పడతాయి. ఇది లీటరుకు 18 నుంచి 19 కిమీ మైలేజ్ ఇస్తుంది.



హ్యుందాయ్ వెన్యూ: టెక్నాలజీ ప్రేమికులను హ్యుందాయ్ వెన్యూ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ కారు ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఆప్షన్లలో లభిస్తుంది. వెనుక సీట్లలో రీక్లైనింగ్ ఆప్షన్, యాంబియంట్ లైటింగ్ వల్ల లోపలి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లెవెల్-2 అడాస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లు, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇది లీటరుకు 17 నుంచి 21 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story