Ather: రూ.లక్షకే ఏథర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 161 కి.మీ రేంజ్

Ather: ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారతీయ మార్కెట్లోకి అత్యంత ఆకర్షణీయమైన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది.

CR Reddy
Published on: 24 Sept 2026 11:20 AM IST
Ather Konarc
X

Ather Konarc

Ather: ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారతీయ మార్కెట్లోకి అత్యంత ఆకర్షణీయమైన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చింది. తన నాలుగో వార్షిక కమ్యూనిటీ డే వేడుకల్లో భాగంగా కంపెనీ ఏథర్ కోనార్క్ పేరుతో ఈ సరికొత్త ఈవీని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌తో పాటు కంపెనీ తన కొత్త ఈఎల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా పరిచయం చేసింది. రోజువారీ ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా దీన్ని డిజైన్ చేశారు. దీని ప్రారంభ ధర రూ.99,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

ఈ కోనార్క్ సిరీస్‌ను ప్రధానంగా ఎస్, జెడ్ అనే రెండు వేరియంట్లలో తీసుకువచ్చారు. ప్రస్తుతానికి ఎస్ సిరీస్‌కు సంబంధించిన మూడు మోడళ్ల ధరలను కంపెనీ ప్రకటించింది. కోనార్క్ ఎస్ 100 ధర రూ.99,999 కాగా, ఎస్ 125 ధర రూ.1,21,999, టాప్ ఎండ్ మోడల్ అయిన ఎస్ 161 ధర రూ.1,44,999గా నిర్ణయించారు. ఇందులో ఎస్ 100 మోడల్‌లో 2.1kWh బ్యాటరీ ఉండగా, ఎస్ 125లో 2.7kWh, ఎస్ 161 మోడల్‌లో 3.5kWh సామర్థ్యం గల పవర్ఫుల్ బ్యాటరీని అమర్చారు. ఈ స్కూటర్లు సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 161 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు.

ఈ స్కూటర్‌లో రైడర్ల సౌలభ్యం కోసం అనేక అత్యాధునిక ఫీచర్లను జోడించారు. రివర్స్ గేర్ సాయంతో స్కూటర్‌ను వెనక్కి జరపడానికి పార్క్ అసిస్ట్, అలాగే ట్రాఫిక్ లో ఆగినప్పుడు కదలకుండా ఉండేందుకు ఆటో హోల్డ్ ఫీచర్ ఇచ్చారు. జెడ్ వేరియంట్లలో ఏఈబీఎస్ అనగా అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. దీనివల్ల బ్రేకింగ్ సామర్థ్యం మరింత మెరుగవుతుంది. అలాగే మ్యాజిక్-కీ ఫీచర్ సాయంతో ఏథర్ యాప్ ద్వారా స్కూటర్ బూట్‌ను సులభంగా ఓపెన్ చేసుకోవచ్చు. జెడ్ సిరీస్‌లో ఆటోపాప్ ఫీచర్ కూడా ఉంటుంది.

టెక్నాలజీ పరంగానూ ఈ స్కూటర్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. కోనార్క్ జెడ్ వేరియంట్ డ్యాష్‌బోర్డ్‌లో నేరుగా గూగుల్ మ్యాప్స్, వాట్సాప్ సపోర్ట్ లభిస్తుంది. స్కూటర్ ఆగి ఉన్న సమయంలో క్రికెట్ స్కోర్‌లను కూడా చూసే వెసులుబాటు కల్పించారు. ఏథర్ కనెక్ట్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా యాంటీ-థెఫ్ట్ అలర్ట్, ఫైండ్ మై స్కూటర్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు పొందవచ్చు. ఎస్ 125, ఎస్ 161 మోడళ్ల డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానుండగా, ఎస్ 100 మోడల్ 2027 తొలి త్రైమాసికంలో మార్కెట్లోకి రానుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.