Bajaj Pulsar: రూ.1.98 లక్షలకే బజాజ్ కొత్త బైక్.. గూగుల్ మ్యాప్స్, 5 రైడింగ్ మోడ్స్‌తో అదుర్స్

బజాజ్ ఆటో తన పాపులర్ స్పోర్ట్స్ బైక్ పల్సర్ RS200 కొత్త 2027 మోడల్‌ను రూ.1.98 లక్షలకు లాంచ్ చేసింది.

CR Reddy
Published on: 22 Nov 2026 11:59 AM IST
Bajaj Pulsar RS200
X

Bajaj Pulsar RS200

Bajaj Pulsar: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో తన అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ బైక్ పల్సర్ RS200 సరికొత్త 2027 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.1.98 లక్షలుగా నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త పల్సర్ RS200లో ఇంజిన్ పవర్‌ను పెంచడంతో పాటు, నేటి తరం రైడర్లు కోరుకునే అనేక హైటెక్ ఫీచర్లను జోడించింది. రోడ్డు పరిస్థితులకు తగ్గట్టుగా బైక్ నడిపేందుకు వీలుగా ఇందులో మొదటిసారిగా రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఆధునిక సదుపాయాలు కల్పించింది.

5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే

కొత్త బజాజ్ పల్సర్ RS200లో జరిగిన అతిపెద్ద మార్పు దీని డిస్‌ప్లేలోనే కనిపిస్తుంది. పాత కలర్ ఎల్‌సీడీ స్క్రీన్ స్థానంలో ఇప్పుడు 5 అంగుళాల కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇందులో గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ సదుపాయం ఉండటం వల్ల ప్రయాణంలో దారి చూసుకోవడం చాలా సులభమవుతుంది. దీనితో పాటు అడ్జస్టబుల్ లీవర్లు, యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, పానిక్ బ్రేక్ అలర్ట్, హజార్డ్ స్విచ్ లాంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా స్మూత్ యాక్సిలరేషన్ కోసం ఎలక్ట్రానిక్ థ్రాటిల్ బాడీ సిస్టమ్‌ను కూడా అందించారు.

స్కిడ్ కాకుండా ట్రాక్షన్ కంట్రోల్

రైడర్లకు మరింత మెరుగైన, సురక్షితమైన అనుభూతిని ఇచ్చేందుకు బజాజ్ ఇందులో ఐదు రకాల రైడింగ్ మోడ్‌లను ఇచ్చింది. స్పోర్ట్, రోడ్, రెయిన్, ఆఫ్-రోడ్, టూర్ మోడ్‌లలో మన అవసరాన్ని బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. వీటికి తోడు ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా రావడంతో వర్షంలో లేదా జారుడు రోడ్లపై వెళ్లేటప్పుడు టైర్లు అవసరానికి మించి స్లిప్ కాకుండా బైక్ అదుపులో ఉంటుంది.

యూఎస్‌డీ ఫోర్క్స్, స్పోర్ట్స్ షిఫ్టర్

ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త పల్సర్ RS200లో పాత 199.5cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌నే కొనసాగించినప్పటికీ దాన్ని మరింత మెరుగుపరిచారు. ఇప్పుడు ఈ ఇంజిన్ 25 bhp పవర్, 18.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే పాత మోడల్‌తో పోలిస్తే 1 bhp పవర్ అదనంగా పెరిగింది. గేర్లు వేయడం మరింత వేగంగా ఉండేందుకు స్పోర్ట్స్ షిఫ్టర్ కూడా ఇచ్చారు. బైక్ ముందు భాగంలో 37mm యూఎస్‌డీ ఫోర్క్స్, వెనుక భాగంలో కొత్త 140/70-R17 రేడియల్ టైర్‌ను అమర్చడం వల్ల కార్నరింగ్, హ్యాండ్లింగ్ మరింత మెరుగయ్యాయి.

4 క్రేజీ కలర్ ఆప్షన్లు

మెకానికల్‌గా, ఫీచర్ల పరంగా ఇన్ని మార్పులు చేసినా బైక్ బయటి రూపంలో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. ఇంజిన్ వరకు పూర్తిగా కవర్ చేసే దీని ఐకానిక్ ఫుల్లీ-ఫెయిర్డ్ స్పోర్టీ డిజైన్‌ను అలాగే కొనసాగించారు. 2015లో NS200 ఆధారంగా తొలిసారి వచ్చిన ఈ బైక్, బజాజ్ సంస్థ నుంచి వచ్చిన మొదటి, ఏకైక ఫుల్లీ-ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ కావడం విశేషం. కొత్త 2027 పల్సర్ RS200 బ్రూక్లిన్ బ్లాక్, పెర్ల్ మెటాలిక్ వైట్, కరేబియన్ బ్లూ, రేసింగ్ రెడ్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.