YS Sharmila: చంద్రబాబును పెళ్లికి పిలిస్తే తప్పేంటి? జగన్‌కు షర్మిల సూటి ప్రశ్న!

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 17 Nov 2026 4:56 PM IST
YS Sharmila
X

YS Sharmila: చంద్రబాబును పెళ్లికి పిలిస్తే తప్పేంటి? జగన్‌కు షర్మిల సూటి ప్రశ్న!

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడికి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక తీవ్ర ప్రకటన విడుదల చేస్తూ.. సంబంధిత కథనం ద్వారా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.

‘‘తండ్రి వయసున్న వ్యక్తి చంద్రబాబుకు శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా? ఆత్మీయ సంబంధాలు అంటగడతారా? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా?’’ అంటూ షర్మిల నిలదీశారు. తనపై సాక్షి పత్రికలో వచ్చిన కథనం తీవ్ర అభ్యంతరకరమని, తనకు, తన కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వైఎస్సార్‌సీపీ అండ్ కో నీచపు బుద్ధికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలు లేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ఠ అని విమర్శించారు.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి షర్మిల పలు కీలక ప్రశ్నలు సంధించారు. ‘‘జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు.’’

‘‘ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబుగారిని వైఎస్సార్ గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగినట్లా? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే వైఎస్సార్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా?’’ అని ప్రశ్నించారు.

జగన్‌కు డైరెక్ట్ ప్రశ్నలు: ‘‘అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నిందలు వేయడమా మీ పత్రిక విధానం? తల్లి, చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాయించడమేనా మీ ఎజెండా? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా? సమాధానం చెప్పాలి’’ అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా వివాహానికి ఆహ్వానిస్తే అందులోనూ రాజకీయ కోణాలు వెతుకుతూ, నీచపు రాతలు రాయించినందుకు సంజాయిషీ ఎవ ఇస్తారని వైఎస్ షర్మిల తీవ్రంగా నిలదీశారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.