YS Jagan: ఎన్నికలా.. ప్రభుత్వ సెలక్షన్లా? ఏపీ కూటమి సర్కార్‌పై జగన్ సంచలన ఆరోపణలు!

YS Jagan: ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు. శకుని మాయా పాచికల తరహాలో ఎన్నికలు జరుగుతున్నాయని విమర్శలు.

Arun Chilukuri
Published on: 5 Nov 2026 4:35 PM IST
YS Jagan
X

YS Jagan: ఎన్నికలా.. ప్రభుత్వ సెలక్షన్లా? ఏపీ కూటమి సర్కార్‌పై జగన్ సంచలన ఆరోపణలు!

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగడం లేదని, 'ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్' అనే నానుడి కేవలం కాగితాలకే పరిమితమైందని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అక్రమాలు జరుగుతున్నాయని, పురాణాల్లో శకుని మాయా పాచికల తరహాలో కూటమి ప్రభుత్వం ఎన్నికలను ఏకపక్షంగా నడిపిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్నది ఎలక్షన్లా లేక ప్రభుత్వ సెలక్షన్లా అనేది ప్రజలకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

ఎన్నికల హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 143 హామీలు ఇచ్చిందని, కానీ వాటి అమలుపై మాత్రం చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

ఎన్నికలు నిజాయితీగా, నిష్పాక్షికంగా జరిగితే తమకు తీవ్ర ఓటమి తప్పదని భావించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నేతలు తప్పుడు మార్గాలను ఎంచుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నిమిషం నుంచే బైండోవర్ల పేరిట తమ పార్టీ శ్రేణులు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర నిర్బంధానికి గురిచేశారని ఆరోపించారు.

రిటర్నింగ్ అధికారుల (RO) స్థాయి నుంచే అక్రమాలు మొదలయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 84 ప్రాంతాల్లో తమ వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని వైఎస్ జగన్ వెల్లడించారు. మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాలు ఉంటే కేవలం 16,604 కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో రీకౌంటింగ్ పేరిట మళ్లీ గందరగోళం సృష్టించి తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.