YS Jagan: స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అక్రమాలు.. లోకేష్ రాజీనామా చేయాలి: జగన్ డిమాండ్
YS Jagan: మెగా డీఎస్సీ-2025 పూర్తిగా మోసపూరితమైనదని, స్పోర్ట్స్ కోటా పేరుతో భారీగా అక్రమాలు జరిగాయని వైయస్ జగన్ ఆరోపించారు.
YS Jagan: స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అక్రమాలు.. లోకేష్ రాజీనామా చేయాలి: జగన్ డిమాండ్
YS Jagan: మెగా డీఎస్సీ-2025 అనేది నిరుద్యోగులను, నిజాయితీపరులైన అభ్యర్థులను మోసం చేసిన పెద్ద కుంభకోణమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన పలు కీలక ఆధారాలను వెల్లడించారు. ఈ కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రశ్నపత్రాల తయారీ, పర్యవేక్షణ వంటి రెండు కీలక విభాగాలను ఒకే వ్యక్తి చేతిలో పెట్టడం ద్వారా స్కామ్‌కు ద్వారాలు తెరిచారని వైయస్ జగన్ విమర్శించారు.
జీవో నంబర్ 4, 47లను తెచ్చి ఎటువంటి పరీక్ష లేకుండానే నేరుగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కట్టబెట్టారని, ఆ తర్వాత జీవోలను రద్దు చేశారని తెలిపారు. జూడో, సాఫ్ట్‌బాల్ వంటి క్రీడా సంఘాల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు.
టెట్ (TET) అర్హత లేకున్నా, తప్పు మార్కులతోనూ, వేరే కులాల రిజర్వేషన్లు మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) నిబంధనలను ఉల్లంఘించి అభ్యర్థులకు పోస్టులు కట్టబెట్టారని మండిపడ్డారు.
డీఎస్సీ తరహాలోనే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అటవీశాఖ ఉద్యోగాల్లోనూ పరీక్షలు లేకుండానే స్పోర్ట్స్ కోటా కింద పోస్టులు ఇచ్చేందుకు ప్రయత్నించారని, అయితే అక్రమాలు బయటపడటంతో ఆ ప్రక్రియను నిలిపివేశారని పేర్కొన్నారు.
ఈ కుంభకోణంలో అధికారంలో ఉన్న పెద్దల ప్రమేయం ఉందని, రాష్ట్ర అధికారులతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడవని స్పష్టం చేసిన జగన్.. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.




