Undavalli: నిజం గెలిచింది.. నీతి నిలిచింది.. చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు.. లోకేష్ నిరసన!

Undavalli: చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన వేళ ఉండవల్లిలో నారా లోకేష్ 53 కొవ్వొత్తులు వెలిగించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 9 Sept 2026 9:03 PM IST
Undavalli
X

Undavalli: నిజం గెలిచింది.. నీతి నిలిచింది.. చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు.. లోకేష్ నిరసన!

ఉండవల్లి: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ నినాదంతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా నమోదు చేసిన తప్పుడు కేసులో చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం ప్రకటించాయి.

ఉండవల్లి నివాసంలో టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ 53 కొవ్వొత్తులు వెలిగించారు. చంద్రబాబు అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన 53 రోజులకు ప్రతీకగా ఈ కొవ్వొత్తులను వెలిగించారు. నాటి చీకటి రోజులకు నిరసనగా, తప్పుడు కేసులపై పోరాటానికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలుగా నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తూ రాజకీయ విలువలకు ప్రతీకగా నిలిచిన చంద్రబాబునాయుడిపై అప్పటి వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు చీకటి అధ్యాయంగా మిగిలిపోతాయని పేర్కొన్నారు.

అయితే కాలం గడిచేకొద్దీ నిజం వెలుగులోకి వచ్చిందని లోకేష్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజల ఆశీస్సులు, ప్రజల అండదండలతో చంద్రబాబు తప్పుడు కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, ఎన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎదురైనా చంద్రబాబు వెనక్కి తగ్గలేదని అన్నారు.

చంద్రబాబుపై జరిగిన అన్యాయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ‘నిజం గెలిచింది’ నినాదంతో కొవ్వొత్తులు వెలిగిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు ప్రజల్లో ఉన్న విశ్వాసం, అభిమానం ఏ స్థాయిలో ఉందో ఈ కార్యక్రమాలు మరోసారి నిరూపిస్తున్నాయని అన్నారు.

తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడికి ప్రజా బలమే శ్రీరామరక్ష అని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడికి ప్రజలే అండగా నిలుస్తారని, రాజకీయ కుట్రలు, తప్పుడు కేసులు ఎప్పటికీ ప్రజా తీర్పును మార్చలేవని అన్నారు.

మూడేళ్ల క్రితం జరిగిన అరెస్టు ఘటనను గుర్తు చేసుకుంటూ నిర్వహించిన ఈ కొవ్వొత్తుల కార్యక్రమం ద్వారా టీడీపీ శ్రేణులు తమ నిరసనను వ్యక్తం చేయడంతో పాటు చంద్రబాబుకు తమ సంఘీభావాన్ని చాటిచెప్పాయి. ‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story