Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరో వర్ష గండం.. ఏయే జిల్లాల్లో వానలు పడతాయంటే?
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి కీలక హెచ్చరిక జారీ చేసింది. నవంబర్ 30న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, డిసెంబర్ 2 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
Weather Report
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి కీలక హెచ్చరిక జారీ చేసింది. చలి తీవ్రత పెరుగుతున్న సమయంలో వరుణుడు మళ్లీ తన ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నాడు. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 30వ తేదీ నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో నేటి నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది.
వాయుగుండంగా బలపడే ఛాన్స్
బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా బలపడి డిసెంబర్ 2వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వివిధ అంతర్జాతీయ వాతావరణ మోడల్స్ ప్రకారం ఈ వాయుగుండం తీరం దాటకముందే సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని, అయినా తెలుగు రాష్ట్రాలపై దీని ప్రభావం తప్పకుండా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 4 వరకు వర్షాల ముప్పు
ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేటి నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. వర్షాలు కురిసే సమయంలో తీర ప్రాంతాలతో పాటు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలోని 15 జిల్లాలకు వర్ష సూచన
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావం తెలంగాణపైనా గట్టిగానే ఉండబోతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఇక్కడ కూడా గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.




