Chandrababu: జనవరిలోనే ఆ ఎన్నికలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు డెడ్‌లైన్!
Chandrababu: విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు, 11 లక్షల ఉద్యోగాలు రానున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
Chandrababu: జనవరిలోనే ఆ ఎన్నికలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు డెడ్‌లైన్!
Chandrababu: విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు రాష్ట్ర ఆర్థిక రంగానికి మైలురాయిగా నిలవబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ సదస్సు ద్వారా దాదాపు రూ. 11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు (MoUs) జరగనున్నాయని, వీటి ద్వారా సుమారు 11 లక్షల మందికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కీలక సదస్సుకు రాష్ట్ర మంత్రులంతా తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.31 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను సాధించామని, వీటి ద్వారా మొత్తం 25 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం చంద్రబాబు వివరించారు.
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై స్పష్టతనిస్తూ, వచ్చే జనవరిలో సహకార ఎన్నికలు నిర్వహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే సొసైటీ, పంచాయతీ, సహకార ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే పరిపాలన యంత్రాంగాన్ని తిరిగి పూర్తిస్థాయి అభివృద్ధి మూడ్‌లోకి తీసుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
ఇకపై ప్రతి కేబినెట్ సమావేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్‌డీపీ (GSDP) వృద్ధి రేటుపై ప్రత్యేకంగా చర్చించాలని సీఎం నిర్ణయించారు. ప్రజలకు నిత్యావసరాలు అందుబాటు ధరల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే మార్కెట్‌లో కూరగాయల ధరలు కొంతమేర తగ్గాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా, బియ్యం ధరలు కూడా తగ్గేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.




