Vijaysai Reddy: 11-11-11 ముహూర్తంపై విజయసాయిరెడ్డి క్లారిటీ.. భుజాలు తడుముకుంటే నాకేంటి సంబంధం?
Vijaysai Reddy: వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించానన్న విజయసాయిరెడ్డి. నవంబర్ 11న ఏపీలో కొత్త పార్టీ పేరు ప్రకటన, టీడీపీ నేత ఓవీ రమణ చేరికపై వ్యాఖ్యలు.
Vijaysai Reddy: 11-11-11 ముహూర్తంపై విజయసాయిరెడ్డి క్లారిటీ.. భుజాలు తడుముకుంటే నాకేంటి సంబంధం?
Vijaysai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మరో సంచలనం నమోదుకాబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తాను ఉన్న సమయంలో తీవ్రమైన మనోవేదన అనుభవించానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రూపుదిద్దుకోబోతోందని స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ నెల 11వ తేదీన తమ నూతన రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టంచేశారు.
ఇక పార్టీ ప్రకటనకు ముందే ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ బోర్డు సభ్యుడు, టీడీపీకి రాజీనామా చేసిన ఓవీ రమణ విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి, కొత్త పార్టీలో ఓవీ రమణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని వెల్లడించారు. గతంలో తామిద్దరం టీటీడీ బోర్డులో కలసి పనిచేసిన అనుభవంతో పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు నూతన పార్టీని ప్రకటించడంపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్స్ మరియు విమర్శలపై కూడా విజయసాయిరెడ్డి స్పందించారు. వేద పండితులు సూచించిన శ్రేష్ఠమైన ముహూర్త బలం ప్రకారమే ఆ సమయాన్ని ఎంచుకున్నామని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని విస్పష్టంగా చెప్పారు.
తమ సమయం చూసి ఎవరో భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనని ఎద్దేవా చేశారు. తాను స్వయంగా పదవులు తీసుకోకుండా మెంటార్‌గా వ్యవహరిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం, అధికారం కట్టబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఏపీలో బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని, పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తంచేశారు.




