Vijayasai Reddy: ఏపీలో కొత్త రాజకీయం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావం!
Vijayasai Reddy: విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి 11-11-11 ముహూర్తానికి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.
Vijayasai Reddy: ఏపీలో కొత్త రాజకీయం.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావం!
Vijayasai Reddy new party: ఏపీ రాజకీయ తెరపై ఒక సంచలనాత్మక ఘట్టానికి వేళయింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పక్కా ముహూర్తంతో, విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్ వేదికగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సమరశంఖం పూరించారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో నడుస్తున్న రెండు ప్రధాన పార్టీలు, రెండు కుటుంబాల ఆధిపత్య పోరుకు ముగింపు పలకడమే లక్ష్యంగా మూడో ప్రత్యామ్నాయంగా ఈ కొత్త పయనం ప్రారంభమవుతోంది.
రాయలసీమ పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ పార్టీని స్థాపించబోతున్నానని విజయసాయిరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. కుల, మత పిచ్చి రాజకీయాలను పూర్తిగా తిరస్కరిస్తూ... అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతామని ప్రకటించారు. కరెంట్ కోతలు, తాగు-సాగునీటి కష్టాలు లేని నవ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రతి ఎకరానికి రెండు పంటలు పండేలా సాగునీరు అందిస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, చదువుల భారాన్ని తగ్గించి జెన్ జీ యువతకు 100% ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నారు. 80 ఏళ్లుగా నెరవేరని ప్రజల కలలను సాకారం చేస్తూ, యువతనే రేపటి నాయకులుగా తీర్చిదిద్దడమే పార్టీ లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు.
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరికల వేడి మొదలైంది. వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సైంటిస్ట్, సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఇప్పటికే విజయసాయిరెడ్డితో జతకట్టేందుకు సిద్ధమయ్యారు. జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి స్వస్తి చెప్పిన విశాఖపట్నానికి చెందిన పీతల మూర్తియాదవ్ కూడా ఈ వైపే అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు దళిత, హిందూత్వ సంఘాల నాయకులు సుమతీరెడ్డి, బోణి గణేష్ వంటి నేతలు కూడా పార్టీలోకి రాబోతున్నారని సమాచారం.
ఇటీవల స్థానిక సంస్థల్లో టికెట్లు దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న వివిధ పార్టీల నాయకులు, ద్విధ్రువ రాజకీయాలకు స్వస్తి చెప్పాలనుకుంటున్న ద్వితీయ శ్రేణి నాయకత్వమంతా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ వైపు ఆసక్తిగా చూస్తోంది.
ఏపీ రాజకీయాల్లో ఇప్పటివరకు రెండు బలమైన వ్యవస్థల మధ్య సాగిన పోరుకు, విజయసాయిరెడ్డి తీసుకొస్తున్న ఈ 11-11-11 ముహూర్తం ఎలాంటి మలుపు తిప్పబోతోంది? జెన్ జీ తరాన్ని కలుపుకొని ఆయన వేస్తున్న ఈ అడుగులు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఎంతవరకు మారుస్తాయి అనేది ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.




