తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. గరుడ సేవ ఎప్పుడంటే.?

TTD: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మరో ఆధ్యాత్మిక పర్వదినానికి వేళయింది. తిరుమల పుణ్యక్షేత్రంలో అక్టోబరు 12 నుంచి..

G Krishna
Published on: 11 Oct 2026 4:34 PM IST
TTD
X

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. గరుడ సేవ ఎప్పుడంటే.?

TTD: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మరో ఆధ్యాత్మిక పర్వదినానికి వేళయింది. తిరుమల పుణ్యక్షేత్రంలో అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేసింది.

చాంద్రమాన గణాంకాల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి అధికమాసం వస్తుండగా, ఈ ఏడాది శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగడం విశేషం. ఇప్పటికే భాద్రపద మాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియగా, దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఆశ్వయుజ మాసంలో ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టంతో ఈ ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు.

ప్రత్యేక ఆచారాలతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

సాధారణ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఉండే కొన్ని ఆచారాలకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు చిన్నపాటి వ్యత్యాసాలు ఉంటాయి. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం వంటి క్రతువులు ఉండవు. నేరుగా అంకురార్పణతో ప్రారంభమై చక్రస్నానంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఉత్సవాల ప్రధాన ఆకర్షణ అయిన 'గరుడ వాహన సేవ' అక్టోబరు 16న సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు నేత్రపర్వంగా సాగనుంది.

తొమ్మిది రోజుల వాహన సేవల వైభవం

ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 12న ఉదయం బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. అక్టోబరు 13న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహన సేవలు జరగనున్నాయి. అక్టోబరు 14న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహన సేవలు, అక్టోబరు 15న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహన సేవలు నిర్వహించనున్నారు. ఇక అక్టోబరు 16న ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిచ్చే శ్రీవారు, అదే రోజు సాయంత్రం అత్యంత ప్రాశస్త్యమైన గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించనున్నారు.

స్వర్ణరథం, చక్రస్నానంతో ఉత్సవ పరిసమాప్తి

ఉత్సవాల ద్వితీయార్ధంలో అక్టోబరు 17న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానం, రాత్రి గజ వాహన సేవలు ఘనంగా జరగనున్నాయి. అక్టోబరు 18న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు, అక్టోబరు 19న ఉదయం 7 గంటలకు భక్తుల జయజయధ్వనాల నడుమ స్వర్ణరథ ఊరేగింపు, రాత్రి అశ్వ వాహన సేవలు అలరించనున్నాయి.

చివరి రోజున అక్టోబరు 20న ఉదయం 6 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవంతో ఈ తొమ్మిది రోజుల నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో ముగుస్తాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.