Weather Update: కళింగపట్నం సమీపంలో రాత్రి తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

Weather Update: కళింగపట్నానికి సమీపంలో ఇవాళ రాత్రి తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Arun Chilukuri
Published on: 23 Sept 2026 5:04 PM IST
Weather Update
X

Weather Update: కళింగపట్నం సమీపంలో రాత్రి తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!

Weather Update: ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వైపు తీవ్ర వాయుగుండం ముంచుకొస్తోంది. కళింగపట్నానికి సమీపంలో ఇవాళ రాత్రి 8 నుంచి 12 గంటల మధ్య ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశముందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారికంగా వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, తీర ప్రాంతాల్లో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ (Flash Floods) వచ్చే ముప్పు ఉందని పేర్కొంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కాకినాడ, గంగవరం, విశాఖపట్నం మరియు కళింగపట్నం పోర్టుల్లో అధికారులు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు:

ఇవాళ (బుధవారం): శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

గురువారం: అల్లూరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి.

ఈనెల 25న: అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగనుంది.

ప్రజలు ఎవరూ అప్రమత్తంగా లేకుండా బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప సురక్షిత ప్రాంతాలు దాటవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.