Raptadu Attack: రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. నిందితుడి పై పోలీసుల కాల్పులు
Raptadu Attack: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Raptadu School Attack
Raptadu Attack: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తరగతి గదిలోకి చొరబడిన ఓ యువకుడు ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై విచక్షణారహితంగా దాడి చేయడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన తర్వాత పరారైన నిందితుడు హేమంత్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. తాజాగా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడు తప్పించుకునేందుకు యత్నించడంతో కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆత్మకూరు అడవుల్లో పోలీసుల గాలింపు
బాలికపై దాడి చేసిన తర్వాత హేమంత్ పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీసులు చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరించినా హేమంత్ తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పోలీసులపై రాళ్లతో దాడి చేయడంతో పాటు, ఒక పోలీసు అధికారిపై కత్తితో దాడికి యత్నించినట్లు కూడా సమాచారం వెలువడింది. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే కాల్పులపై పూర్తి అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
తరగతి గదిలోకి వచ్చి విద్యార్థినిపై దాడి
రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. ఉపాధ్యాయిని తరగతి గదిలో పాఠాలు చెబుతున్న సమయంలో హేమంత్ ఎలక్ట్రిక్ రంపంతో లోపలికి వచ్చాడు. ప్రేమిస్తున్నానంటూ గతంలో బాలికను వేధించినట్లు సమాచారం. ఆమె తిరస్కరించడంతో పాటు కుటుంబ సభ్యులు మందలించడంతో కక్ష పెంచుకున్నాడని ప్రాథమిక సమాచారం. తరగతి గదిలోనే విద్యార్థుల ముందే బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మి కాళ్లకు గాయాలయ్యాయి. విద్యార్థుల కేకలతో పాఠశాలలో భయాందోళనలు నెలకొన్నాయి.
బెంగళూరులో బాలికకు ప్రత్యేక వైద్యం
తీవ్రంగా గాయపడిన బాలికను తొలుత అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. రంపం దాడి కారణంగా ముఖం, మెడ, వీపు భాగాల్లో తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు. మరో విద్యార్థిని లక్ష్మికి కూడా వైద్య సహాయం అందించారు.
బాలికను పరామర్శించిన లోకేశ్
బెంగళూరులోని ఆసుపత్రికి వెళ్లిన మంత్రి నారా లోకేశ్ బాధిత బాలికను పరామర్శించారు. వైద్యులను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 48 గంటల పాటు ఇన్ఫెక్షన్ ప్రమాదం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు లోకేశ్ వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్‌ను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు, కాల్పులకు దారితీసిన పరిస్థితులపై పోలీసుల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




