Nara Lokesh: గోపిక ఆరోగ్యం మెరుగుపడుతోంది.. ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ లోకేశ్ ధన్యవాదాలు!
Nara Lokesh: రాప్తాడు దాడి బాధితురాలు విద్యార్థిని గోపిక కోలుకుంటోంది. నారా లోకేష్ ఎక్స్ పోస్ట్ ద్వారా ఘన ఆహారం, నడక అప్‌డేట్ వెల్లడి.
Nara Lokesh: గోపిక ఆరోగ్యం మెరుగుపడుతోంది.. ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ లోకేశ్ ధన్యవాదాలు!
Nara Lokesh: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్మాది జరిపిన రంపపు దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఘటన జరిగినప్పటి నుంచి చిన్నారి వైద్య సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్న ఆయన, సోషల్ మీడియా వేదికగా గోపిక తాజా ఆరోగ్య పరిస్థితిపై సమాచారాన్ని పంచుకున్నారు. బాధితురాలికి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో నిపుణులైన వైద్య బృందం మెరుగైన వైద్యం అందిస్తోందని వెల్లడించారు.
చిన్నారి గోపిక ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉందనే శుభవార్తను మంత్రి లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఇవాళ ఆమె ఆస్పత్రి బెడ్‌పై నుంచి లేచి కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చోగలిగిందని, వైద్యులు ఆమెకు ఘన ఆహారాన్ని (Solid Food) అందించడం కూడా ప్రారంభించారని పేర్కొన్నారు.
అంతేకాకుండా వైద్యుల పర్యవేక్షణలో నేడు ఆమె సొంతంగా కొన్ని అడుగులు ముందుకు వేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ చేస్తున్న నిరంతర ప్రార్థనలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతపురం రాప్తాడు స్కూలు ప్రాంగణంలో జరిగిన ఈ భయానక దాడి తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయగా, గాయపడిన బాలికల పూర్తి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
గోపిక క్రమంగా కోలుకుంటూ మళ్లీ నడక ప్రారంభించే దిశగా వేగంగా అడుగులు వేస్తుండటంతో ఆమె కుటుంబ సభ్యులు, పాఠశాల విద్యార్థులు మరియు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




