Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం
Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update
Weather Update: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రాబోయే మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు స్పష్టం చేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ప్రభావం
కోస్తాంధ్ర ప్రదేశ్, యానాం ప్రాంతాలలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాయలసీమ జిల్లాలలో కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలోనూ పలు చోట్ల వానలు
తెలంగాణలో ఇటీవల వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఆ వాయుగుండం బలహీనపడినప్పటికీ, ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మళ్లీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు అలాగే బయటికి వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.




