Prashant Kishor: ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్ట్‌... ప్రశాంత్‌ కిషోర్‌ రీ ఎంట్రీ? లోటస్‌పాండ్‌ నుంచే వ్యూహం!!

ప్రశాంత్‌ కిషోర్‌ జన్‌ సురక్ష పార్టీ నుంచి బీహార్‌ బంకీపూర్‌ స్థానంలో విజయం సాధించిన తరువాత ఆయన వ్యూహాలపై మరోసారి ఆసక్తి నెలకొంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఆయన మరోసారి పనిచేయబోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

Balachander
Published on: 4 Aug 2026 2:44 PM IST
Prashant Kishor: ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్ట్‌... ప్రశాంత్‌ కిషోర్‌ రీ ఎంట్రీ? లోటస్‌పాండ్‌ నుంచే వ్యూహం!!
X

Prashant Kishor: బీహార్‌లో గ్రాండ్ విక్టరీ తర్వాత ఏపీపై ప్రశాంత్ కిషోర్ దృష్టి... లోటస్ ప్లాన్ నిజమేనా? 30 ఏళ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన పీకే... ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వైరల్ అవుతున్న వ్యూహాలు..సెప్టెంబర్ 1 నుంచి లోటస్ పాండ్ వేదికగా సన్నాహాలు? సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఏపీ పొలిటికల్ హీట్! అసలు కథేంటి... తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ ప్రచారం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన రాజకీయ వ్యూహకర్త, ఇటీవల బీహార్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రశాంత్ కిషోర్ మళ్లీ ఏపీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 151 స్థానాల చారిత్రాత్మక విజయాన్ని అందించిన పీకే, ఇప్పుడు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వేదికగా మళ్లీ ఏపీ వ్యూహాలకు పదును పెట్టనున్నారని జోరుగా చర్చ జరుగుతోంది.

బీహార్‌లో సంచలన విజయం ... 30 ఏళ్ల కంచుకోట బద్దలు

గతంలో నరేంద్ర మోదీ, వైఎస్ జగన్, స్టాలిన్, తలపతి విజయ్ వంటి నాయకులకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ‘జన్ సూరజ్’ పార్టీని స్థాపించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి సీట్లు దక్కకపోయినప్పటికీ, పట్టువదలకుండా పోరాడారు. ఇటీవల పట్నా పరిధిలోని బంకీపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో పీకే స్వయంగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. 1995 నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు బీజేపీ కరడుగట్టిన కంచుకోటగా ఉన్న బంకీపూర్ సీటును పీకే గెలుచుకోవడం భారత రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ నియోజకవర్గం నుంచి 5 సార్లు వరుసగా గెలిచిన బీజేపీ నేత రాజ్యసభకు వెళ్లడంతో వచ్చిన ఈ ఖాళీని పీకే దక్కించుకుని, తొలిసారిగా ఎమ్మెల్యేగా చట్టసభలో అడుగుపెట్టారు.

లోటస్ పాండ్ వేదికగా సెప్టెంబర్ 1 నుంచి వ్యూహాలు?

బీహార్‌లో ఈ గెలుపు ఇచ్చిన ఊపుతో పీకే దృష్టి మళ్లీ ఏపీపై పడిందనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఢీకొట్టేందుకు వైఎస్సార్ సీపీకి మళ్లీ ఆయన వ్యూహాలు అవసరమని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ కేంద్రంగా ప్రశాంత్ కిషోర్ తమ వ్యూహరాచనను ప్రారంభించనున్నారని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, వైఎస్సార్ సీపీ అధినాయకత్వం ఈసారి పీకేకి వ్యూహాల విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకునేందుకు కూడా పీకేకు అధికారాలు కట్టబెడుతున్నట్టుగా సమాచారం. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలి. ఎవరిని తప్పించాలి. ఏ నియోజకవర్గం అనుకూలంగా ఉన్నది. ఎటువంటి ప్రణాళికలు అవసరం, ఎలాంటి ప్రచారాలు చేయాలి అనే దానిపై పీకే టీమ్‌ పనిచేయబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది.

రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఎన్నికల వ్యూహకర్తగా ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు స్వయంగా ఒక ప్రజాప్రతినిధిగా మారి తన సత్తా చాటారు. అయితే, ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్న ఈ రీ ఎంట్రీ వార్తలు కేవలం సోషల్ మీడియా ప్రచారమేనా లేక దీని వెనుక నిజంగానే రాజకీయ అడుగులు పడుతున్నాయా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. ఏది ఏమైనా, పీకే పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story