Pawan Kalyan: కక్షసాధింపులు లేవు.. అభివృద్ధే మా ధ్యేయం..

Pawan Kalyan: వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు.

G Krishna
Published on: 5 Oct 2026 12:41 PM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: కక్షసాధింపులు లేవు.. అభివృద్ధే మా ధ్యేయం..

Pawan Kalyan: వైఎస్‌ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రూ.30,000 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టబోయే 'జల్ జీవన్ మిషన్' ప్రాజెక్టు పనులకు ఇరువురు నేతలు వైభవంగా శంకుస్థాపన చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తాగునీటి మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

'మినీ ముంబై', 'మినీ మైసూర్' ప్రొద్దుటూరు: పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరును పౌరుషాల గడ్డగా అభివర్ణించిన ఆయన, ఇక్కడి వస్త్ర, బంగారు వ్యాపారాల ప్రాముఖ్యతను బట్టి దీనిని 'మినీ ముంబై' అని, వైభవంగా జరిగే దసరా ఉత్సవాల విశిష్టతను బట్టి 'మినీ మైసూర్' అని పిలుచుకుంటారని కొనియాడారు.

కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సమాధానంగానే రూ.30 వేల కోట్ల నిధులతో ఈ బృహత్తర తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తమది అభివృద్ధి ఆధారిత ప్రభుత్వమని, ఎలాంటి రాజకీయ లేదా ప్రాంతీయ వివక్ష చూపకుండా, కక్షసాధింపులకు తావులేకుండా పాలన సాగిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన కాంట్రాక్టర్ల బిల్లులను కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్లియర్ చేసిందని గుర్తుచేశారు.

గత పాలనపై విమర్శలు.. అభివృద్ధే మా ప్రాధాన్యం

గత వైఎస్‌‌ఆర్‌సీపీ ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల పాలనలో తాగునీటి రంగానికి కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, కానీ తమ కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన స్వల్పకాలంలోనే ప్రత్యేక దృష్టి సారించి రూ.30 వేల కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో తాళ్లమాపురం గ్రామానికి చెందిన 6,000 మంది జనాభా తమ తాగునీటి సమస్యపై ఇచ్చిన అర్జీలను అధికారులు, పాలకులు నలిపి పక్కన పడేసారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేసిన సామాన్యులను నాటి ఎమ్మెల్యే పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పిన ఉదంతాలను గుర్తుచేశారు. తమకు కుటుంబ ఆధారిత రాజకీయం కాదని, ప్రజాభివృద్ధే ముఖ్యాంశమని స్పష్టం చేశారు.

గొడవలు, కొట్లాటలు, గొడ్డలి పోట్లతో కాకుండా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని, ప్రస్తుతం పనుల పర్యవేక్షణ వేదిక కాబట్టి రాజకీయ విమర్శలు తగ్గించానని, ఎన్నికలు వచ్చినప్పుడు తన ప్రసంగం వేరే స్థాయిలో ఉంటుందని చెప్పారు. అలాగే జల్ జీవన్ మిషన్ పైప్‌లైన్ తవ్వకాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంట్రాక్టర్లు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.