Vizianagaram: పేగు బంధం అంటే ఇదే.. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను 7 కిలోమీటర్లు భుజాన మోసిన తల్లి..!

Vizianagaram: విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలో దారుణం. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను 7 కిలోమీటర్లు భుజాన మోసిన తల్లి, రోడ్డు సౌకర్యం లేక గిరిజనుల అవస్థలు.

Arun Chilukuri
Updated on: 2 Nov 2026 11:34 AM IST
Vizianagaram
X

Vizianagaram: ప్రేగు బంధం అంటే ఇదే.. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను 7 కిలోమీటర్లు భుజాన మోసిన తల్లి..!

Vizianagaram: బిడ్డకు చిన్న కష్టం వస్తేనే విలవిలలాడే తల్లి మనసు, అనారోగ్యంతో బాధపడుతున్న కన్న బిడ్డను బతికించుకోవడం కోసం ఎలాంటి కష్టానికైనా వెనుకాడదని నిరూపించే అత్యంత దయనీయమైన సంఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో వెలుగుచూసింది. దారపర్తి పంచాయతీ శివారు పల్లపు దుంగాడ గిరిజన గ్రామానికి చెందిన జన్ని సుకరమ్మ, కన్నయ్య దంపతుల 12 ఏళ్ల కుమార్తె సంపూర్ణ తీవ్ర అనారోగ్యానికి గురైంది.

అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గ్రామానికి కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని ఘోర పరిస్థితి నెలకొంది. కన్నబిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి గత్యంతరం లేని ఆ తల్లి, ఒక సంచిలో తాగడానికి మంచినీళ్ల సీసా పెట్టుకుని అనారోగ్యంతో ఉన్న కుమార్తెను తన భుజాలపై వేసుకుని ఏకంగా 7 కిలోమీటర్ల మేర రాళ్లు, రప్పలతో కూడిన కొండ దారిలో నడిచింది.

అతి కష్టం మీద కొండ దిగువన ఉన్న దిబ్బగుంట గ్రామానికి చేరుకున్న ఆ తల్లి, అక్కడ అందుబాటులోకి వచ్చిన ఒక ఆటోలో కుమార్తెను ఎస్‌.కోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం చేయించింది. చికిత్స అనంతరం మళ్లీ అదే రీతిలో బిడ్డను భుజాన మోసుకుంటూ కొండపై ఉన్న తన ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు స్థానికులను, అధికారులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. పల్లపు దుంగాడ గ్రామానికి 6.5 కిలోమీటర్ల మేర బిసిపి రోడ్డు నిర్మించేందుకు ప్రధాని గ్రామీణ సడక్ (PMGSY) పథకం కింద ఎనిమిదేళ్ల క్రితమే రూ.4.90 కోట్లు మంజూరయ్యాయి.

అయితే కొంతమేర పనులు పూర్తి చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతుల గడువు ముగియడంతో కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ రోడ్డు అంచనా వ్యయం రూ.6.50 కోట్లకు పెరిగిపోవడంతో అధికారులు మళ్లీ సవరించిన ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాకపోవడంపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మరియు ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ గ్రామానికి శాశ్వత రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.