Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడనున్న వాతావరణం.. నేడు ఆ జిల్లాల్లో వర్షాలు!

Weather Update: గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఎట్టకేలకు చల్లని కబురు అందించింది.

CR Reddy
Published on: 17 Sept 2026 7:24 AM IST
Weather Update
X

Weather Update 

Weather Update: గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఎట్టకేలకు చల్లని కబురు అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాబోయే రెండ్రోజుల్లో అల్పపీడనంగా మారనుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడనుంది.

కోస్తాంధ్ర, ఒడిశా తీరాల వైపు పయనం

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనితో పాటు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో శనివారం (సెప్టెంబర్ 19) నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలోనూ దంచికొట్టనున్న వానలు

ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఈ ఆవర్తన ప్రభావంతో ఇక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం పూట ఎండ, ఉక్కపోత ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోనుంది. దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 2-3 గంటల పాటు నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో చెదురుమదురుగా వానలు కురిసే ఛాన్స్ ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.