Mamidikuduru: పాశర్లపూడి వై జంక్షన్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు!

Mamidikuduru: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి వై జంక్షన్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు.. భద్రతా చర్యలకు స్థానికుల ఆందోళన.

PRABHU, RAZOLE
Published on: 20 Sept 2026 1:20 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: పాశర్లపూడి వై జంక్షన్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు!

Mamidikuduru: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం పాశర్లపూడి కైకాలపేటలోని వై జంక్షన్‌ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

NH-216 జాతీయ రహదారి నుంచి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు కనెక్టివిటీ కల్పించి సుమారు ఆరు నెలలు గడిచిందని, అప్పటి నుంచి పాశర్లపూడి వై జంక్షన్‌ వద్ద తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. రహదారి అనుసంధానం కల్పించినప్పటికీ వాహనదారుల భద్రతకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు మరణాలు సంభవించినా సంబంధిత అధికారులు తగిన స్థాయిలో స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన వై జంక్షన్‌ వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. NH-216పై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. వాహనదారులకు ముందస్తు సమాచారం అందేలా ప్రమాద సూచికలు, రహదారి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. మామిడికుదురు, గెద్దాడ, చింతలపల్లి, శివకోటి ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ–NH కనెక్టివిటీ వద్ద కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

రహదారి అనుసంధాన ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE