Kothapeta: కొత్తపేటలో స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారుల సమన్వయ సమావేశం

Kothapeta: స్థానిక సంస్థల ఎన్నికలపై కొత్తపేట ఆర్డీవో, డీఎస్పీల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. శాంతిభద్రతలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సమీక్షించారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 15 Oct 2026 10:13 PM IST
Kothapeta
X

Kothapeta: కొత్తపేటలో స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారుల సమన్వయ సమావేశం

Kothapeta: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలపై కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి జి.వి.వి. సత్యనారాయణ, కొత్తపేట సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎస్. మురళీమోహన్ సంయుక్తంగా సమన్వయ సమావేశం నిర్వహించారు. గురువారం కొత్తపేట ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పరిస్థితిని సమీక్షించారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను కాపాడాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.

వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీవో జి.వి.వి. సత్యనారాయణ సూచించారు.

సమావేశంలో కొత్తపేట డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), సంబంధిత పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వోలు) పాల్గొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA