Murder Case : ఇబ్రహీంపట్నం హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. హత్యకు దారి తీసిన రూ.20వేలు..
Murder Case : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మహిళ హత్య కేసులో దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనిపించకుండా పోయిన మహిళను దారుణంగా
Murder Case : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మహిళ హత్య కేసులో దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కనిపించకుండా పోయిన మహిళను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి బ్యాగుల్లో నింపి కెనాల్‌లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భవానీపురానికి చెందిన షఫి ప్రధాన నిందితుడిగా నిర్ధారించినట్లు సమాచారం.
అసలు కథ ఏంటి?
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. మృతురాలు కళ్యాణికి షఫితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కళ్యాణి కుమారుడిని కూడా షఫి పెంచుతున్నట్లు సమాచారం. అయితే కొంతకాలంగా డబ్బుల విషయంలో కళ్యాణి, షఫి మధ్య వివాదాలు తలెత్తినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 17న తనకు రూ.20 వేలు ఇవ్వాలని కళ్యాణి షఫిని డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని ఆమె బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం చివరకు తీవ్ర పరిణామాలకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంటికి తీసుకెళ్లి హత్య.. గొల్లపూడి కూలింగ్ కెనాల్‌లో..
కళ్యాణిని భవానీపురంలోని తన ఇంటికి తీసుకెళ్లిన షఫి అక్కడ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బ్యాగుల్లో నింపినట్లు దర్యాప్తులో తేలింది. తన మటన్ షాపులో పనిచేసే గురువులు అనే వ్యక్తికి ఈ విషయం చెప్పిన షఫి.. అతడి సహాయంతో మృతదేహాన్ని తరలించినట్లు తెలుస్తోంది.
మృతదేహం ముక్కలను బ్యాగుల్లో నింపుకుని గొల్లపూడి సమీపంలోని కూలింగ్ కెనాల్‌లో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. మృతదేహాన్ని ఎలా తరలించారు? హత్య తర్వాత ఎలాంటి ఆధారాలు మిగిలాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరికొందరి పాత్రపైనా విచారణ
ఇదిలా ఉంటే.. కళ్యాణికి సన్నిహితంగా ఉన్న మరికొందరి పాత్రపైనా పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. బంగారం షాప్‌కు చెందిన దామోదర్, కరీం హోటల్ గౌస్, ఆల్ఫా హోటల్‌కు చెందిన అదానీ అలీతో కళ్యాణికి ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో వీరి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఒక మహిళ అదృశ్యంతో మొదలైన ఈ కేసులో.. వివాహేతర సంబంధం, డబ్బుల వ్యవహారం, బెదిరింపులు, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా నరికి కెనాల్‌లో పడేయడం వంటి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుండటంతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.




