Kartikeya Misra: ‘‘నేను సీఎంవో అధికారిని, నా కారునే ఆపుతారా?’’.. కార్తికేయ మిశ్రా ఆగ్రహానికి ఐదుగురు చిరుద్యోగులు బలి!
Kartikeya Misra: "నేను సీఎంవో అధికారిని, నా కారునే ఆపి గుర్తింపుకార్డు అడుగుతారా? నేనేంటో చూపిస్తా" అంటూ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదర్శించిన అధికార దర్పం ఐదుగురు చిరుద్యోగుల ఉపాధిని దెబ్బతీసింది.
Kartikeya Misra: "నేను సీఎంవో అధికారిని, నా కారునే ఆపి గుర్తింపుకార్డు అడుగుతారా? నేనేంటో చూపిస్తా" అంటూ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదర్శించిన అధికార దర్పం ఐదుగురు చిరుద్యోగుల ఉపాధిని దెబ్బతీసింది. ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా ఆగ్రహానికి వెంకటపాలెం టోల్‌ప్లాజా సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. నిబంధనల ప్రకారం టోల్ ఫీజు చెల్లించాలని లేదా మినహాయింపు కోసం గుర్తింపు కార్డు (ID Card) చూపించాలని అడగడమే ఆ చిరుద్యోగులు చేసిన నేరమా? అంటూ ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టోల్గేట్ వద్ద ఏం జరిగిందంటే..
గురువారం కార్తికేయ మిశ్రా విజయవాడ బైపాస్‌లోని వెంకటపాలెం టోల్గేట్ మీదుగా ప్రయాణిస్తున్నారు. టోల్గేట్ వద్దకు రాగానే గేటు ఎత్తాలని ఆయన డ్రైవర్ అక్కడి సిబ్బందిని కోరారు. అయితే, నిబంధనల ప్రకారం టోల్ మినహాయింపు పొందాలంటే గుర్తింపు కార్డు చూపించాలని విధుల్లో ఉన్న సిబ్బంది అడిగారు. దీంతో కారులో ఉన్న కార్తికేయ మిశ్రాకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాను సీఎంవో కార్యదర్శినని చెబుతున్నా ఐడీ కార్డు అడుగుతారా అంటూ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
10 నిమిషాల పాటు కారులోనే ఉండి..
విషయం తెలుసుకున్న టోల్గేట్ ఇన్‌ఛార్జి వెంటనే అక్కడికి చేరుకుని, మీరు ఎవరనే విషయం తెలియక సిబ్బంది పొరపాటుగా అడిగారని, క్షమించాలని కోరారు. అయినా శాంతించని ఆయన.. "మీరు సారీ చెప్పి వెళ్లిపొమ్మంటే నేను వెళ్లిపోవాలా? నేనేంటో చూపిస్తా" అంటూ సుమారు పది నిమిషాల పాటు టోల్గేట్ వద్దే కారులో ఉండిపోయారు.
కార్యాలయానికి పిలిపించి మరీ వేటు:
అక్కడి నుంచి వెళ్లిన అనంతరం ఎన్హెచ్ఏఐ (NHAI) అధికారులు, టోల్ ప్లాజా నిర్వాహకులను కార్తికేయ మిశ్రా తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. తాను టోల్గేట్ వద్దకు వచ్చిన సమయంలో విధుల్లో ఉన్న ఐదుగురు సిబ్బందిని తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం తమ విధి తాము నిర్వర్తించిన చిరుద్యోగులపై ఉన్నతాధికారి వేటు వేయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




