AP Cyclone Alert: తుపాను హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం..హోంమంత్రి అనిత ఆదేశాలు!

AP Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం నేపధ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 Oct 2026 11:52 AM IST
AP Cyclone Alert
X

AP Cyclone Alert: తుపాను హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం..హోంమంత్రి అనిత ఆదేశాలు!

AP Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. రానున్న ఐదు రోజుల పాటు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.

వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హోంమంత్రి తెలిపారు. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభావిత జిల్లాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

తుపాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని హోంమంత్రి సూచించారు. ముఖ్యంగా ప్రమాదకర స్థితిలో ఉన్న హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. బలమైన గాలులు వీచే సమయంలో ఇవి కూలిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, పట్టణాలు, నగరాల్లో అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.

తీరప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హోంమంత్రి పేర్కొన్నారు. అవసరమైతే ముంపు, ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బాధితులను తరలించేందుకు అవసరమైన వాహనాలు, పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. జిల్లా కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అత్యవసర సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు చేరవేయాలని స్పష్టం చేశారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్‌), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్ఎఫ్‌) బృందాలను సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా, రహదారులు, తాగునీరు వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత శాఖలు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హోంమంత్రి స్పష్టం చేశారు. బీచ్‌లలోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడే ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ సెల్ఫీలు దిగడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

రైతులు, ప్రజలు తమ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అనిత కోరారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. సోషల్‌ మీడియాలో వచ్చే నిర్ధారణలేని సమాచారాన్ని నమ్మవద్దని, వదంతులను ఇతరులకు పంపవద్దని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) జారీ చేసే అధికారిక హెచ్చరికలు, సూచనలను మాత్రమే అనుసరించాలని హోంమంత్రి అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.