ప్రియుడి బెయిల్ కోసం మాదకద్రవ్యాల స్మగ్లింగ్.. షాకింగ్ నిజాలు వెల్లడించిన పోలీసులు!
విజయవాడ రైల్వేస్టేషన్లో 110 గ్రాముల MDMA డ్రగ్స్‌తో దొరికిన నాగసౌమ్య అనే యువతి. జైల్లో ఉన్న ప్రియుడిని విడిపించేందుకు బెంగళూరు నుంచి స్మగ్లింగ్.
ప్రియుడి బెయిల్ కోసం మాదకద్రవ్యాల స్మగ్లింగ్.. షాకింగ్ నిజాలు వెల్లడించిన పోలీసులు!
జైలులో ఉన్న తన ప్రియుడిని బెయిల్‌పై విడిపించుకునేందుకు డబ్బులు లేక డ్రగ్స్ స్మగ్లర్‌గా మారిన ఓ యువతి విజయవాడ రైల్వే స్టేషన్లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. కమీషన్ ఆశ చూపి బెంగళూరు నుంచి 'ఎండీఎంఏ' డ్రగ్స్ తెప్పించిన ప్రధాన నిందితుడితో పాటు సదరు యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈగల్ మరియు జీఆర్పీ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది.
విజయవాడ పటమటకు చెందిన నాగసౌమ్య అనే యువతికి మత్తు పదార్థాల అలవాటు ఉంది. ఆమె ప్రియుడు కాశీవర్ధన్ డ్రగ్స్ సరఫరా చేస్తూ మూడు నెలల క్రితం చిత్తూరులో అరెస్ట్ అయి జైలులో ఉన్నాడు. అతడిని బెయిల్‌పై బయటకు తీసుకురావడానికి నాగసౌమ్య వద్ద డబ్బులు లేవు.
ఇదే అవకాశంగా భావించిన కృష్ణలంకకు చెందిన డ్రగ్ పెడ్లర్ బషీర్.. ఆమెకు రూ.లక్ష ఇచ్చి బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ తీసుకురావాలని, అందుకుగాను రూ.50 వేల కమీషన్ ఇస్తానని ఆశ చూపాడు.
అంగీకరించిన సౌమ్య, ఈ నెల 13న బెంగళూరులోని యలహంక వెళ్లి ఒక వ్యక్తి వద్ద 110 గ్రాముల MDMA సేకరించింది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు తన ప్యాంటు లోపల ప్రత్యేకంగా కుట్టించుకున్న చిన్న జేబులో ఆ ప్యాకెట్లను దాచి బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ బయలుదేరింది.
డ్రగ్స్ రవాణా అవుతోందన్న ముందస్తు సమాచారంతో ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, జీఆర్పీ ఇన్స్పెక్టర్ రమణ ఆధ్వర్యంలో పోలీసులు విజయవాడ రైల్వేస్టేషన్లో కాపుకాశారు.
మంగళవారం అర్ధరాత్రి రైలు విజయవాడ చేరగానే పోలీసులు సోదాలు ప్రారంభించారు. రైల్లో తనిఖీలు జరుగుతున్నాయని సౌమ్య ఫోన్ చేసి చెప్పడంతో బషీర్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. పోలీసులు సౌమ్యను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా ప్యాంటు జేబులోని 110 గ్రాముల MDMA లభ్యమైంది. పరారైన బషీర్‌ను విజయవాడ నగరంలో బుధవారం పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.




