Vijiayasai Reddy: కొత్త పార్టీ ఏర్పాటును వేగవంతం చేసిన విజయసాయి రెడ్డి.. టీటీడీ మాజీ సభ్యుడికి ఆహ్వానం

Vijiayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన కొత్త పార్టీ ఏర్పాటును వేగవంతం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన, టీటీడీ మాజీ సభ్యుడు ఓవి రమణను పార్టీలోకి ఆహ్వానించారు.

Arun Chilukuri
Published on: 9 Oct 2026 12:33 PM IST
Vijiayasai Reddy: కొత్త పార్టీ ఏర్పాటును వేగవంతం చేసిన విజయసాయి రెడ్డి.. టీటీడీ మాజీ సభ్యుడికి ఆహ్వానం
X

Vijiayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీకి దూరమైన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు బలమైన ప్రత్యామ్నాయ శక్తినే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన, తన కొత్త పార్టీలోకి తన మిత్రుడు, టీటీడీ మాజీ సభ్యుడు ఓవి రమణను బహిరంగంగా ఆహ్వానించారు.

త్వరలో ప్రారంభించబోతున్న నూతన రాజకీయ పార్టీ విజయవంతం కావాలని కోరుకుంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

గతంలో తాను, ఓవి రమణ సుమారు నాలుగేళ్ల పాటు టీటీడీ బోర్డు సభ్యులుగా కలిసి పనిచేశామని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రారంభించబోయే కొత్త పార్టీలో కూడా ఆయనతో కలిసి పని చేసి విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో తమ పార్టీ ద్వారా చేసి చూపిస్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తిరుమలలో చారిత్రాత్మకమైన వెయ్యి కాళ్ల మండపాన్ని వెంటనే పునర్నిర్మించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీయర్ స్వామి మరియు ఇతర పీఠాధిపతుల ఆకాంక్ష మేరకు ఈ నిర్మాణం వేగంగా జరగాలని కోరారు.

వైసీపీ వీడిన తర్వాత సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేసే దిశగా విజయసాయి రెడ్డి పావులు కదుపుతుండటం, కీలక నేతలను కలుస్తుండటం ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.