Kadapa: నామినేషన్ల వద్ద రణరంగం.. గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపిన టీడీపీ నేత డాక్టర్ బాలసుబ్రమణ్యం!

Kadapa: కడప జిల్లా నందలూరు జడ్పీటీసీ నామినేషన్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత. గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన టీడీపీ నేత బాలసుబ్రమణ్యం. కానిస్టేబుల్‌కు గాయాలు, రెండు కార్లు దగ్ధం.

Arun Chilukuri
Published on: 22 Oct 2026 3:13 PM IST
Kadapa
X

Kadapa: నామినేషన్ల వద్ద రణరంగం.. గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపిన టీడీపీ నేత డాక్టర్ బాలసుబ్రమణ్యం!

Kadapa: వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో స్థానిక సంస్థల (జడ్పీటీసీ) నామినేషన్ల పర్వం తీవ్ర హింసాత్మకంగా మారింది. కూటమి నాయకుల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీలోని రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు భగ్గుమంది. నామినేషన్ల కేంద్రం వద్ద ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో నందలూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఘర్షణ తీవ్రరూపం దాల్చి పరిస్థితి అదుపు తప్పుతున్న సమయంలో టీడీపీ నేత, తిరుపతి ఎలైట్ ఆస్పత్రి అధినేత డాక్టర్ బాలసుబ్రమణ్యం తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీతో గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఆకస్మిక కాల్పుల ఘటనా స్థలంలో తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్ బ్రాంచ్ (SB) కానిస్టేబుల్ మనోజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

నందలూరుకు చెందిన ఎద్దుల విజయసాగర్‌కు మద్దతుగా టీడీపీ రాజంపేట ఇన్‌ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, ఎలైట్ హాస్పిటల్ అధినేత బాలసుబ్రమణ్యం వర్గం నిలవగా, మరోవైపు మేడా విజయశేఖర్ రెడ్డి వర్గం దీనిని తీవ్రంగా నిరసించింది. జడ్పీటీసీ నామినేషన్ దాఖలు విషయంలో ఇరువర్గాల మధ్య ప్రారంభమైన వాగ్వాదం పరస్పరం దాడులకు దారితీసింది. ఆందోళనకారులు రెండు కార్లకు నిప్పుపెట్టి పూర్తిగా దగ్ధం చేయగా, పలు ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులు సహా ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు అదనపు పోలీసు బలగాలను నందలూరుకు తరలించారు. ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రణరంగాన్ని తలపించిన నందలూరులో ప్రస్తుతం పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.