Eluru: ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడులో సోమవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నిద్రిస్తున్న సమయంలో ఇల్లు తగలబడటంతో ఇద్దరు వృద్ధ మహిళలు సజీవదహనమయ్యారు.
Eluru: ఏలూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం!
Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో అకస్మాత్తుగా సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇద్దరు వృద్ధ మహిళలు సజీవదహనమయ్యారు. గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో వారు ప్రాణాలు రక్షించుకునే అవకాశం లేక నిద్రలోనే కాలిబూడిదయ్యారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. వేలేరుపాడుకు చెందిన వలగాని సావిత్రి (60) వద్దకు, తెలంగాణలోని సూర్యాపేట నుంచి ఆమె అక్క పూలమ్మ (65) కొన్ని రోజుల క్రితం వచ్చింది. సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి ఇంట్లో నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత నూతనంగా నిర్మించిన ఆ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే ఇల్లంతా మంటలు వ్యాపించడంతో సావిత్రి, పూలమ్మలు నిద్రలోనే ప్రాణాలు విడిచారు.
అగ్ని కీలల ధాటికి సావిత్రి ఇల్లు పూర్తిగా కాలిబూడిదైంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవి పక్కనే ఉన్న పొరుగు ఇంటికి కూడా వ్యాపించాయి. దీంతో ఆ ఇల్లు కూడా పూర్తిగా నష్టపోయింది. స్థానికులు గమనించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న వేలేరుపాడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చెల్లిని చూసేందుకు వచ్చిన అక్క, చెల్లితో పాటే సజీవదహనం కావడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.




