Cyclone Murasu: మురసు తుపాను హెచ్చరికలు.. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అత్యున్నత స్థాయి సమీక్ష..
Cyclone Murasu: మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అత్యవసర సమీక్ష. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల అధికారులకు అప్రమత్తత ఆదేశాలు.
Cyclone Murasu: మురసు తుపాను హెచ్చరికలు.. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అత్యున్నత స్థాయి సమీక్ష..
Cyclone Murasu: మురసు తుపాను (Cyclone Murasu) ముప్పు పొంచివున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అత్యవసరంగా టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల మరియు కృష్ణా జిల్లాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పవన్ ఆదేశించారు.
అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా వాగులు, వంకలు, ఉప్పొంగుతున్న ప్రవాహాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా గట్టి నిఘా ఉంచాలని సూచించారు.
తుపాను కారణంగా తాగునీరు మరియు విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం కలగకుండా, ఒకవేళ అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని పవన్‌కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.




